Ramcharan Bimbisara Director vasishta :పీరియాడికల్ సోషియో ఫాంటసీ సినిమా 'బింబిసార'ను తెరకెక్కించి తొలి ప్రయత్నంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వశిష్ఠ. ప్రస్తుతం తన రెండో సినిమానే మెగాస్టార్ చిరంజీవితో చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. 'విశ్వంభర' అనే మరో భారీ సోషియో ఫాంటసీ చిత్రం చేస్తున్నారు. అయితే ఆ మధ్యలో వశిష్ఠ మెగా పవర్ స్టార్ రామ్చరణ్తోనూ ఓ సినిమా చేయనున్నట్లు జోరుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వశిష్ఠ ఈ విషయంపై ఎట్టకేలకు స్పష్టత ఇచ్చారు. అసలేం జరిగిందో వివరణ ఇచ్చారు.
" మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో నేను 'బాహుబలి' లాంటి సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, నేనెప్పుడూ ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ మూవీ గురించి మాట్లాడితే రామ్ చరణ్‌తో అని భావించి రాసేశారు. చిరంజీవితో 'జగదేకవీరుడు అతిలోక సుందరి' లాంటి ఫాంటసీ సినిమా చేయాలనుందని చెప్పాను అంతే. చరణ్‌తో ప్రాజెక్ట్ గురించి నేను ప్రస్తావించలేదు. నాకు ఫాంటసీ స్టోరీస్ అంటే ఇష్టం. అందుకే వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. 'బింబిసార' సీక్వెల్‌ను నేను డైరెక్ట్ చేయడం లేదు. ఆ మూవీ విషయంలో నా ఐడియాలజీ వేరుగా ఉంది. ఈలోపు నాకు 'విశ్వంభర' ఆఫర్ వచ్చింది. ఆ విషయాన్ని కల్యాణ్ రామ్‌తో చెప్పి పర్మిషన్ తీసుకొనే 'బింబిసార 2' నుంచి బయటకు వచ్చాను" అని వశిష్ఠ పేర్కొన్నారు.