హీరో, హీరోయిన్లకే కాదు కొందరు డైరెక్టర్లకూ అభిమానులు ఉంటారు. హీరోలకు ఏమాత్రం తగ్గని క్రేజ్ వారికి కూడా ఉంటుంది. అలాంటి వారిలో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన.. ప్రస్తుతం పుష్పతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. దర్శకులుగా మారిన ఆయన శిష్యులు కూడా ఇండస్ట్రీలో బాగా రాణిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే శిష్యులు ప్రయోజకులు అయినప్పుడు ఆ గురువు పడే సంతోషం అంతా ఇంతా కాదు. ఇప్పుడు సుకుమార్ ఆ ఆనందాన్నే పొందుతున్నారు. ఈ లెక్కల మాస్టార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా పని చేసిన చాలామంది ఇప్పటికే మెగాఫోన్ పట్టి భారీ హిట్లను అందుకోగా.. మరి కొంతమంది త్వరలోనే పరిచయం కానున్నారు. ఇప్పుడు చిత్రసీమలో సుకుమార్ శిష్యుల డిమాండ్ పెరిగిందనే చెప్పాలి. సుక్కు శిష్యుడితో సినిమా అంటే హీరోలు, నిర్మాతలు వారితో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఉప్పెన సినిమాతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా భారి హిట్‌ను అందుకున్న బుచ్చిబాబు సుకుమార్ ప్రియ శిష్యుడు. తొలి సినిమాతోనే రూ.100 కోట్ల గ్రాస్ అందుకున్నాడు. ఆ సినిమా సక్సెస్‌తో ఏకంగా రామ్‌చరణ్‌తో ఆర్ సీ 16 ప్రాజెక్ట్‌ను పట్టేశాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ.270కోట్లతో నిర్మించనుందని సమాచారం. అయితే బుచ్చిబాబుకు మరిన్ని ఆఫర్స్ కూడా వస్తున్నాయట. మరి అతడి అడుగులు ఎటువైపో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
కొత్త దర్శకుడు ఓదెల శ్రీకాంత్ తెరకెక్కించిన చిత్రం 'దసరా'. నాని, కీర్తిసురేశ్ హీరోహీరోయిన్లు. అయితే ఈ డైరెక్టర్ కూడా సుక్కు స్కూల్ నుంచి వచ్చినవాడే. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఇతడికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నుంచి పిలుపు వచ్చిందని తెలిసింది. మంచి ఆఫర్‌ను ఇచ్చారట. చూడాలి మరి దసరా సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో, ఇక దిల్ రాజు-ఓదెల కాంబోలో ఎలాంటి ప్రాజెక్ట్ వస్తుందో.