సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా తాను దర్శకత్వం వహించిన నాని సినిమా వైఫల్యంపై దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్య తాజాగా స్పందించారు. సినిమా పరాజయం తర్వాత మహేశ్ అన్న ఓ మాట తననెంతో బాధపెట్టిందని చెప్పారు.
'మహేశ్ అన్న మాటకు చాలా బాధపడ్డాను.. కానీ ఎప్పటికైనా..' - మహేశ్ బాబు నాని సినిమా
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు అన్న ఓ మాట తననెంతో బాధపెట్టిందని చెప్పారు డైరెక్టర్ ఎస్జే సూర్య. అసలేం జరిగింది? మహేశ్ ఏమని అన్నారు?
"నాని సినిమా విషయంలో నాకింకా బాధగానే ఉంది. హీరో కావాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి వచ్చా. నటుడిగా ఎదగడం కోసం మొదట దర్శకుడిని అయ్యాను. ప్రతి చిత్రాన్ని ప్రేమ, ఉత్సాహంతో చేశా. కానీ, నాని అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా విడుదలయ్యాక ఓసారి మహేశ్.. మీరు ఈ చిత్రాన్ని ఎంత ఇష్టపడి చేశారో నాకు తెలుసు. ఫలితాన్ని పక్కనపెడితే మిమ్మల్ని, మీ వర్క్‌ను నేను అభిమానిస్తున్నా అని అన్నారు. ఆయన మాట నాకింకా బాధను కలిగించింది. పవన్ కల్యాణ్‌కు హిట్ ఇచ్చా. మహేశ్‌కు ఇవ్వలేకపోయాననే బాధ ఉండిపోయింది. అయితే, ప్రస్తుతం నా దృష్టి అంతా నటనపైనే ఉంది. నటనపై మక్కువ తగ్గితే.. మళ్లీ దర్శకుడిగా మహేశ్‌తో సినిమా చేసి.. ఎప్పటికైనా హిట్ అందుకుంటా" అని ఆయన వివరించారు.
ఆయన ప్రస్తుతం వదంతి విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఇది విడుదల కానుంది. ఇందులో ఆయన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈసినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఆయన నాని గురించి స్పందించారు.