Director shows interest in OTT Platforms: ఓటీటీ బాటలో నడిస్తే.. సినీ అవకాశాలు తగ్గుతాయేమో? తమ మార్కెట్లు పడిపోతాయేమో? అన్న భయాలు కొంతకాలం క్రితం తారల్ని వెంటాడేవి. కానీ, ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘1992 స్కామ్’, ‘మీర్జాపూర్’ వంటి సిరీస్‌లకు దక్కిన ఆదరణ చూశాక.. సినీవర్గాల ఆలోచనలు మారాయి. ఆయా సిరీస్‌ల దర్శకులు, నటీనటులకు నెట్టింట దక్కిన క్రేజ్ చూశాక... ఈ బాటలో నడిచే సినీతారల సంఖ్య బాగా పెరిగింది. ఇక్కడ నిడివి సమస్యలు లేకపోవడం.. సెన్సార్ సమస్యలు తక్కువ ఉండటం.. ఎలాంటి కథాంశాన్నైనా స్వేచ్ఛగా చెప్పగలిగే సౌలభ్యం ఉండటం.. పారితోషికాలు పెద్ద మొత్తంలో దక్కుతుండటంతో అగ్ర సినీ దర్శకులు సైతం ఇటు వైపు దృష్టి సారించడం మొదలుపెట్టారు. దీంతో ఇప్పుడీ వేదికలు లక్ష్యంగా కథలు చెప్పే దర్శకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ కొన్నాళ్లుగా ఈ వేదికల్నే లక్ష్యంగా చేసుకొని విరివిగా సినిమాలు తీస్తున్నారు. అగ్ర దర్శకుడు మణిరత్నం సైతం ‘నవరస’ లాంటి వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల్ని మెప్పించారు. యువ దర్శకులు నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, నందినిరెడ్డి, సంకల్ప్ రెడ్డి వంటి వారు సైతం ‘పిట్టకథల’తో ఓటీటీ వేదికగా మెరుపులు మెరిపించారు. ఇప్పుడీ బాటలోనే మరికొందరూ వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు.
పల్లెటూరి ‘కథలు’తో.. సతీష్ వేగేశ్న..‘శతమానం భవతి’, ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి కుటుంబ కథా చిత్రాలతో సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సతీష్ వేగేశ్న. ఇప్పుడాయన తొలిసారి ఓ ప్రముఖ ఓటీటీ వేదిక కోసం వెబ్‌సిరీస్ చేస్తున్నారు. పూర్తి పల్లెటూరి కథలతో రూపొందుతోన్న ఈ సిరీస్‌కు ‘కథలు.. మీవి మావి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సిరీస్ నుంచి త్వరలో ‘పడవ’ అనే తొలి కథ బయటకు రానున్నట్లు ప్రకటించారు. ఇందులో సమీర్ వేగేశ్న, ఈషా రెబ్బా జంటగా నటించారు. ఇప్పటికే మూడు కథలు చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయని.. త్వరలోనే మిగిలినవి పూర్తి చేసి విడుదల చేస్తామని సతీష్ తెలిపారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన ‘కోతికొమ్మచ్చి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు ‘శ్రీ శ్రీ రాజావారు’ అనే మరో చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
చైతూతో కలిసి భయపెట్టేందుకు.. వైవిధ్యభరితమైన కథలతో మెప్పించే దర్శకుడు విక్రమ్ కె.కుమార్. ‘24’, ‘మనం’, ‘హలో’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. ఇప్పుడాయన నాగచైతన్యతో కలిసి ఓ హారర్ వెబ్‌సిరీస్‌తో డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ‘మనం’ ‘థాంక్ యూ’ సినిమాల తర్వాత ఈ ఇద్దరి కలయికలో రూపొందుతోన్న మూడో ప్రాజెక్ట్ ఇది. ఈ సిరీస్ కోసం ‘దూత’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సిరీస్.. అమెజాన్ ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలిసింది.