Raviteja Ramarao on Duty: రవితేజ హీరోగా రూపొందిన సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ దర్శకుడు. వాస్తవ సంఘటలనల ఆధారంగా యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శరత్ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలివీ..
మీ తొలి చిత్రం 'కేవో 2' తర్వాత విరామం తీసుకోవడానికి కారణం?
శరత్:కావాలని తీసుకున్న విరామం కాదిది. పెద్ద హీరోలతో చేయాలనుకున్నప్పుడు కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే వారి చేతిలో వరుస సినిమాలుంటాయి. ‘కేవో 2’ తర్వాత విశాల్‌తో ఓ ప్రాజెక్టు విషయమై చర్చలు జరిపా. తర్వాత, కొవిడ్ వచ్చింది. అలా ఆలస్యమైంది. ఈ కథని రవితేజకు ఎప్పుడో వినిపించా.
'రామారావు ఆన్ డ్యూటీ'.. ఈ టైటిల్ గురించి చెప్తారా.. ?
శరత్:రామారావు అనేది చాలా పవర్‌ఫుల్ పేరు. ఆ పేరుకి పరిచయం అవసరం లేదు. ఓ సర్వేలో ‘నంబరు వన్ తెలుగు పర్సనాలిటీ’గా నందమూరి తారక రామారావు నిలిచారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు మోగుమోగుతోంది. ఇదే పేరున్న కేటీఆర్ గొప్ప నాయకుడు. ఇలా ‘రామారావు’ అనే పేరు స్ఫూర్తి నింపుతుంటుంది. అందుకే ఇందులోని కథానాయకుడి పాత్రకు రామారావు అనే పేరు పెట్టా. అదే టైటిల్ అయింది.
ఈ సినిమాలో రవితేజ ఏం డ్యూటీ చేస్తారు?
శరత్:సాధారణంగా మిస్సింగ్ కేసులను పోలీసులు, క్రైమ్ డిపార్ట్‌మెంట్ వారు ఛేదిస్తారు. ఇందులో ప్రభుత్వాధికారి అయిన రవితేజ మిస్సింగ్ కేసును డీల్ చేస్తారు. అది ఎందుకనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మాస్ హీరోగా పేరొందిన రవితేజ నటించిన ‘లార్జన్ దేన్ లైఫ్’ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’.
ఈ కథలో ఇసుక మాఫియా అంశం కీలకమా?
శరత్:ప్రత్యేకంగా ఇసుక మాఫియా అని కాదు. కలెక్టరేట్‌తో ముడిపడిన విభాగాలన్నిటికీ పలు వ్యవస్థలపై ప్రత్యేక అధికారాలుంటాయి. ఏదైనా సమస్యను పరిష్కరించేందుకు కొన్ని సందర్భాల్లో ఆదేశాలు ఇచ్చే హక్కు కలెక్టరేట్‌కు ఉంటుంది. ఈ విషయాన్ని కొన్ని సన్నివేశాల్లో ప్రస్తావించాం. ఇది నాలుగేళ్ల క్రితం నేను రాసుకున్న కథ. రవితేజ హీరోగా ఎంపికయ్యాక ఆయన ఇమేజ్‌కు తగ్గట్టు కొన్ని మార్పులు చేశా. ఆయన గతంలో పోషించిన పాత్రల ఛాయలు ఈ సినిమాలో లేకుండా చాలా కొత్తగా, విభిన్నంగా ఉండేలా శ్రద్ధ తీసుకున్నా.
ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో యాక్షన్ ఎక్కువగా ఉన్నట్టుంది. రవితేజ నుంచి వినోదాన్ని ఆశించొచ్చా?
శరత్:ఎంటర్‌టైన్‌మెంట్ అంటే కామెడీ మాత్రమే అని నేను అనుకోను. ప్రేక్షకుడు లీనమయ్యే ఏ అంశాన్నైనా నేను వినోదంగానే భావిస్తా. యాక్షన్‌తోపాటు ఇందులో ఫన్ ఉంటుంది. కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. స్వయంగా నేను చవిచూసిన ఓ ఘటనను ఇందులో చూపించే ప్రయత్నం చేశా.