Director Rajkumar Kohli Died : బాలీవుడ్ వెటెరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ కోహ్లి శుక్రవారం కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యుల వెల్లడించారు. ఆయన మృతి పట్ల యావత్ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి చెందింది. సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు రాజ్‌కుమార్ కోహ్లికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక 'నాగిన్', 'లూటేరా' లాంటి సూపర్ హిట్ సినిమాలను ఈయన వెండితెరకు పరిచయం చేశారు.
Rajkumar Kohli Movies List : 1930లో జన్మించిన రాజ్ కుమార్ కోహ్లీ.. 1963లో విడుదలైన సప్నీ అనే సినిమాతో మెగాఫోన్ పట్టారు. ఆ తర్వాత ఆయన 1966లో 'దుల్లా భట్టి' అనే పంజాబీ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్కడ నుంచి ఆయన జర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగింది. లూటేరా (1970), కహానీ హమ్ సబ్కీ (1973) లాంటి వరుస విజయాలను ఆయన ఖాతాలో పడ్డాయి. అయితే 1976లో రిలీజైన 'నాగిన్'.. ఆయన కెరీర్‌కు సాలిడ్ హిట్ ఇచ్చింది. దీంతో కోహ్లి పేరు సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. అయితే దాని తర్వాత ఆయన కెరీర్లో కాస్త నెమ్మదించారు. 'నౌకర్ బీవీ'(1983), 'ఇంతేకామ్'(1988),'పతి పత్నీ ఔటర్ తవైఫ్' లాంటి హిట్ సినిమాలను తెరకెక్కించినప్పటికీ.. 'జానీ దుష్మన్' విడుదల తర్వాత ఆయన సినిమాలకు దూరమయ్యారు.
ఆయన డైరెక్టర్‌గానే కాకుండా ఓ ప్రొడ్యూసర్‌గానూ ఇండస్ట్రీలో తన కెరీర్‌ను కొనసాగించారు. 'గౌరా ఔర్ కాలా', 'డంకా', 'లూటేరా' వంటి బాలీవుడ్ చిత్రాలతో పాటు 'దుల్లా భట్టి', 'మెయిన్ జట్టి పంజాబ్ ది', 'పిండ్ డి కుర్హి' వంటి పంజాబీ సినిమాలకు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.