దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన దృశ్య కావ్యం 'ఆర్ఆర్ఆర్'. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపింది. థియేటర్లలో రిలీజై ఏడాది కావొస్తున్నా.. ఈ చిత్రం క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి. విదేశాల్లో 'ఆర్ఆర్ఆర్'కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇటీవలే అమెరికాలోని ఓ థియేటర్లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రీరిలీజ్ చేయగా.. ఒక్క షోకు సంబంధించి 1647 టికెట్లు నిమిషాల్లో అమ్ముడుపోయాయి. తర్వాత షో టికెట్ల కోసం అభిమానులు ఎదురుచూశారు. అలా రిలీజైన ప్రతీచోట ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోతున్నారు.
ఉత్తరాది నగరాల్లో స్పెషల్ సర్వే!
డైరెక్టర్ రాజమౌళి.. 'ఆర్ఆర్ఆర్' చిత్ర విడుదలకు ముందు ఉత్తరాది రాష్టాల్లో భారీ సర్వే చేయించారట. ఇన్నోవా కార్లలో అహ్మదాబాద్, నాగ్‌పుర్, లఖ్‌నవూ సిటీలకు వెళ్లి సర్వే చేపట్టారట. ఆ తర్వాతనే సినిమాకు సంబంధించిన పోస్టర్లు ముద్రించారట. తాజాగా ఈ విషయాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ప్రభు దయాల్ గుప్త.. ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
"మా టీమ్ ద్వారా రాజమౌళి ఓ వారం పాటు సర్వే చేయించారు. ఇన్నోవా కార్లలో వెళ్లి టైర్-2 సిటీల్లో సర్వే చేశాం. అది కూడా ఏజ్ గ్రూప్ బట్టి. మీకు ఎన్టీఆర్ తెలుసా?.. రామ్‌చరణ్ తెలుసా? రాజమౌళి తెలుసా? అన్న ప్రశ్నలు అడిగాం. రాజమౌళి తెలుసా? లేక బాహుబలి తెలుసా? అని కూడా ప్రశ్నించాం. ఎక్కువమంది బాహుబలి మాత్రమే తెలుసు అని సమాధానమిచ్చారు. అందుకే ఉత్తరాది రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన అన్ని పోస్టర్లపై 'From The Director Of Bahubali' అని ఉంటుంది. అయితే ఈ సినిమాలో హిందీ నటీనటులు అజయ్ దేవగణ్, ఆలియా భట్ ఉన్నా.. వాళ్ల చిత్రాలు పోస్టర్లపై పెద్దగా వేసి ప్రేక్షకుల్ని మోసం చేయలేము కదా!" అని దర్శకుడు ప్రభుదయాల్ గుప్త చెప్పుకొచ్చారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు.. ఆర్ఆర్ఆర్ సక్సెస్ సీక్రెట్ ఇదేనేమోనని కామెంట్లు పెడుతున్నారు.