Rajamouli Happybirthday movie trailer: థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుందని కొంత కాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా విశ్లేషిస్తున్నారు. వీక్షకులను హాళ్లకు రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువ స్థాయిలో ప్రేక్షకులను హాళ్లకు రప్పించాలంటే ఏం చేయాలో చెప్పారు దర్శకధీరుడు రాజమౌళి. "హాస్యం, యాక్షన్.. ఇలా నేపథ్యం ఏదైనా దర్శకులు పూర్తిస్థాయిలో న్యాయం చేయగలగాలి. అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది" అని అన్నారు. 'హ్యాపీ బర్త్‌డే' సినిమా ట్రైలర్ విడుదల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రమిది. జులై 8న విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ట్రైలర్ విడుదల వేడుక నిర్వహించింది.
ఈ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ.. "మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు మంచి కథలను వెతికి మరీ పట్టుకుంటారు. క్లాప్ ఎంటర్‌టైనర్ సంస్థతో కలిసి వారు నిర్మించిన 'హ్యాపీ బర్త్‌డే' సినిమా ఎంత బావుంటుందో ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. చెర్రీలాంటి ఎనర్జీ ఉన్న నిర్మాతని నేను చూడలేదు. 24 గంటలూ పనిచేస్తూనే ఉంటారాయన. దర్శకుడు రితేశ్ రానాకు తన కథలపై నమ్మకం ఎక్కువ. ఆయనకు వెటకారం కూడా ఎక్కువే. 'పాన్ తెలుగు ఫిల్మ్' అని ఈ సినిమా పోస్టర్‌పై చూడగానే నాకు నవ్వొచ్చింది. దీన్ని చూస్తుంటే నాపై జోక్ వేశాడేమో అనిపిస్తోంది. సినిమాపరంగా థ్రిల్లర్, కామెడీని కలపడం చాలా కష్టం. థ్రిల్ ఎక్కువైతే కామెడీ.. హాస్యం ఎక్కువైతే థ్రిల్ దెబ్బతింటాయి. అలాంటిది ఈ రెండిటినీ రితేశ్ చాలా బాగా మిక్స్ చేశాడనిపిస్తోంది. లావణ్య నటన బావుంది. ఇలాంటి ప్రధాన పాత్రలు నాయికలకు అరుదుగా లభిస్తుంటాయి. ఇప్పుడున్న కమెడియన్లలో నాకు బాగా ఇష్టమైన వారు వెన్నెల కిశోర్, సత్య. ఈ ఇద్దరూ టీజర్, ట్రైలర్లలో అద్భుతమైన కామెడీ పండించారు" అని రాజమౌళి అన్నారు.