'చందమామ కథలు', 'పిఎస్‌వి గరుడవేగ' వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఇప్పుడాయన 'ది ఘోస్ట్'తో థ్రిల్ పంచేందుకు సిద్ధమయ్యారు. నాగార్జున హీరోగా నటించిన చిత్రమిది. సోనాల్ చౌహాన్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు దర్శకుడు ప్రవీణ్.
"ఘోస్ట్ అనేది ఊహాతీతమైన పేరు. అలాగే చాలా శక్తిమంతమైనది కూడా. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విభాగంలో దీనికొక పవర్ ఉంటుంది. ఇలాంటి అధికారి ఎవరికీ కనిపించడు. ఎక్కడున్నాడో తెలియదు. ఒకవేళ ఎవరైనా తెలుసుకోవాలంటే తను కలుసుకోవాలనుకుంటేనే తెలుస్తుంది. సినిమాలో హీరో క్యారక్టరైజేషన్ ఈతరహాలోనే ఉంటుంది. అందుకే అండర్ వరల్డ్‌లో ప్రతిఒక్కరూ అతన్ని ఈ పేరుతోనే పిలుస్తుంటారు".
క్లాస్‌గా తీసిన మాస్ సినిమా..
"నాగార్జున కోసమే సిద్ధం చేసుకున్న కథ ఇది. ఓ హీరోని దృష్టిలో పెట్టుకుని ఇలా కథ సిద్ధం చేసుకోవడం నా కెరీర్‌లో ఇదే తొలిసారి. నాగ్ సర్ అంటే నా మనసులో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయన ఇంటెన్సిటీ, స్టైల్, గ్రేస్ ఉపయోగించుకొని.. తనని ఎలా చూడాలనుంటున్నానో అలా తీర్చిదిద్దుకున్నా వారి పాత్రను. ఈ చిత్రంలో ఆయన విక్రమ్ అనే ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. యాక్షన్‌తో పాటు ఎమోషన్స్‌కీ ఎంతో ప్రాధాన్యముంది. రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే ఎపిసోడ్స్ దీంట్లో చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే క్లాస్‌గా తీసిన పక్కా మాస్ చిత్రమిది. థియేటర్లలో ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు".
ఆ పోరాట ఘట్టాలు ప్రత్యేకం..
"ఇది పూర్తిగా ఫిక్షనల్ సినిమా. ఏ చిత్రానికీ స్ఫూర్తిగా ఉండదు. ఇందులో మొత్తం 12 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. విరామ, క్లైమాక్స్ సమయాల్లో వచ్చే పోరాట ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దీంట్లో కనిపించే తమహగనే కత్తికీ ఓ స్టోరీ ఉంటుంది. విక్రమ్ తన వృత్తి జీవితంలో చాలా మిషన్స్‌లో పాల్గొని ఉంటారు. అలా తన ప్రయాణంలో భాగంగా జపాన్ వెళ్లినప్పుడు అక్కడ ఓ వ్యక్తి ఇచ్చే మెటల్‌తో తయారు చేసేదే తమహగనే".
కొవిడ్ మేలే చేసింది..
"కొవిడ్ వల్ల మాకు మేలే జరిగింది. అందరూ ప్రపంచ సినిమాలకు అలవాటు పడ్డారు. మంచి చిత్రం ఏది.. అసలు సినిమా నాణ్యత ఎలా ఉండాలి? అన్నది ప్రేక్షకులకు తెలిసింది. ఇప్పుడు ఏది థియేటర్ చిత్రమో.. ఏది ఓటీటీ సినిమానో ప్రతిఒక్కరూ ఇట్టే చెప్పేస్తున్నారు. పోస్టర్, టీజర్ చూసే దాని కోసం థియేటర్ వరకు రావొచ్చో లేదో అంచనా వేసేస్తున్నారు. నా దృష్టిలో సినిమా తీయడమంటే.. సినిమా అనే పుస్తకంలో ఒక పేజీ రాయడం. 'ది ఘోస్ట్ అనేది అలాంటి ఒక పేజీనే. వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ పేజీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతి అక్షరాన్నీ ఆచితూచి రాయాలి. ఈ భయం.. బాధ్యత ఉంటే ప్రతి సినిమా బాగుంటుంది".
నిర్మాతల కష్టాలు తెలుసు..
"సొంత ప్రొడక్షన్‌లో చేయడం వల్ల నిర్మాత కష్టాలు నాకు బాగా తెలుసు. అలాగే ఎంత వరకు రాజీ పడాలో కూడా తెలుసు. సొంత నిర్మాణ సంస్థలో చేస్తే విడుదల సమయంలో సమస్య వస్తుంది. ఇదంత తేలికైన వ్యవహారం కాదు. గతంలో నేనిలాంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నా. నేను ఓ సినిమా చేస్తున్నానంటే ఆ చిత్ర నిర్మాతను కచ్చితంగా సెట్‌కు రమ్మని చెబుతా. ఎందుకంటే ఆయన సెట్‌లో ఉంటే పనులు చకచకా జరిగిపోతాయి".
* "నేను ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నా. పూర్తిగా లండన్ నేపథ్యంలో సాగే చిత్రమిది. దీంట్లో మంచి సందేశం ఉంది. అది భవిష్యత్ తరాలకు గట్టిగా తగిలేలా ఉంటుంది. ఈనెల 10 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంది. దీంతో పాటు త్వరలో ఓ వెబ్‌సిరీస్ కూడా చేయనున్నా".