కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి (86) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దర్శకుడు విశ్వనాథ్ ఫిబ్రవరి 2న మరణించిన విషయం తెలిసిందే. విశ్వనాథ్ చనిపోయిన 24 రోజులకే ఆయన సతీమణి మరణించడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
విశ్వనాథ్ 20 ఏళ్ల వయసులో జయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. అప్పటికి తాను స్థిరపడకపోయినా అమ్మానాన్నలు చెప్పడంతో వివాహానికి అంగీకరించారు. సినిమా విషయాలను విశ్వనాథ్ ఎప్పుడూ ఇంట్లో చర్చించేవారు కాదు. "నా భార్య నా సినిమాలు చూసి అలా ఉన్నాయి.. ఇలా ఉన్నాయి అని విశ్లేషించదు. బాగుంది అని మాత్రం చెబుతుంది" అంటూ ఓ సందర్భంలో విశ్వనాథ్ తన సతీమణి గురించి చెప్పారు. వీరికి ముగ్గురు (ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు) సంతానం. చిత్ర పరిశ్రమపై ఆసక్తిలేకపోవడంతో వారికి ఇష్టమైన రంగాల్లో స్థిరపడ్డారు.
కాగా, విశ్వనాథ్ ఫిబ్రవరి 2న కన్నుమూశారు. సినిమాను కళగా నమ్మిన దర్శకుడిగా విశ్వనాథ్ అజరామరమైన చిత్రాలు తీశారు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. మరుగున పడుతున్న మన సంస్కృతికి, కళలకి తన సినిమాలతో ప్రాచుర్యం కల్పించి బ్రతికించారు. ఆయన పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. ఆయన 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. కానీ.. సినిమాలపై అభిమానంతో చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆయన వాహిని స్టూడియోస్‌లో సౌండ్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1965లో దర్శకుడిగా మారి ఆత్మగౌరవం సినిమాను తెరకెక్కించారు.
ఆ తరువాత ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్ హిట్ మూవీస్‌ను ప్రేక్షకులకు అందించారు. ఆయన కేవలం డైరెక్టర్‌గానే కాకుండా.. నటుడిగా కూడా తన సత్తా చాటుకున్నారు. తొలిసారి శుభసంకల్పం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన ఆయన వజ్రం, కలిసుందాం రా, నరసింహనాయుడు, సీమసింహం, నువ్వులేకనీను లేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో, ఠాగూర్ వంటి పలు చిత్రాల్లో తన నటనతో మెప్పించారు.