Shaakuntalam review: గతేడాది సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ 'యశోద' సినిమాతో బాక్సాఫీస్ ముందు విజయాన్ని అందుకున్న సమంత.. ఇప్పుడు 'శాకుంతలం'తో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. పౌరాణిక చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని... 'రుద్రమదేవి' ఫేమ్ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు. భారీ గ్రాఫిక్స్ హంగులతో త్రీడీలో నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరించారు. మొదటి నుంచి ఈ సినిమాపై సామ్ అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలు, ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి. మరి ఈ అద్భుత ప్రేమ కావ్యం తెరపై ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? సమంత, గుణశేఖర్‌లకు విజయాన్ని అందించిందా? తెలుసుకుందాం..
ఎలా ఉందంటే:కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలంలోని శకుంతల - దుష్యంతుల ప్రేమకావ్యానికి.. తనదైన శైలిలో కాస్త కల్పన జోడించి స్క్రీన్‌పై ఓ అపురూప దృశ్య కావ్యంలా ఆవిష్కరింపజేసే ప్రయత్నం చేశారు గుణశేఖర్. కానీ అది ఫలించలేదనే చెప్పాలి! ఎందుకంటే ఇలాంటి కథను గుణశేఖర్ లాంటి డైరెక్టర్ రూపొందిస్తున్నారంటే.. కచ్చితంగా అందులో వైవిధ్యం ఆశిస్తాం. కానీ, ఇక్కడ ఈ ప్రేమకావ్యాన్ని చదువుతున్నప్పుడు కలిగే అనుభూతి.. తెరపై చూస్తున్నప్పుడు కొంచెం కూడా కలగలేదు. విజువల్ ఎఫెక్ట్ తేలిపోయాయి. ఇలా నాసిరకమైన త్రీడీ హంగులు, నత్తనడకన సాగే కథనం, సంఘర్షణ లేని ప్రేమ కథ.. ఈ సినిమా! దష్యంతుడు-శకుంతల(దేవ్ మోహన్-సమంత) మధ్య ఉన్న ప్రేమను, కెమిస్ట్రీని మనసులకు హత్తుకునేలా చూపించలేకపోయారు గుణశేఖర్. దీంతో ప్రేక్షకులు మొదటి నుంచే వారి ప్రేమకథకు అంతగా కనెక్ట్ కాలేకపోయారు. అయితే ఈ ప్రేమ కథ మధ్యలో కుదిరినప్పుడల్లా.. అసురజాతి కాలానీముల కథను, దుర్వాస మహర్షి కథను పరిచయం చేసే ప్రయత్నం ప్రేక్షకుల్ని మెప్పిస్తాయని చెప్పాలి. ఇంటర్వెల్లో దుర్వాస మహర్షి ఎంట్రీ బాగుంది. ఇక ద్వితీయార్ధం ఆరంభం ఆసక్తికరంగా సాగుతుంది. కానీ, ఆ తర్వాత కథ కాస్త గాడి తప్పుతుంది. అయితే క్లైమాక్స్ సీన్స్‌లో భరతుడిగా అల్లు అర్హ ఎంట్రీ.. దుష్యంతుడితో ఆమె వాదన మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఎవరెలా చేశారంటే: శకుంతల పాత్రకు సమంత న్యాయం చేసింది. కానీ, ఆ పాత్ర ఆమెకెందుకో అంతగా సెట్ అవలేదనిపించింది. సొంత డబ్బింగ్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. అయితే ఎమోషనల్ సీన్స్ మాత్రం బాగానే చేసింది. దుష్యంతుడి పాత్రకు తగ్గ రూపం దేవ్ మోహన్‌కు ఉన్నప్పటికీ.. ఆయన నటన నేచురల్‌గా లేదనిపించింది. నిజానికి ఆ పాత్రకు కాస్త పేరున్న యాక్టర్‌ను తీసుకుని ఉంటే మార్కెట్ పరంగా కలిసొచ్చేది. దుర్వాస మహర్షి పాత్రకు మోహన్‌బాబు సరిగ్గా సెట్ అయిపోయారు. ఆయన కనిపించేది కొద్దిసేపే అయినా అందరినీ కట్టిపడేశారు. సచిన్, అనన్య, మధుబాల, జిషు సేన్ గుప్తా.. ఇలా ఎన్నో పాత్రలు కనిపించినా.. అవన్నీ గుర్తుంచుకునే స్థాయిలో లేవు. క్లైమాక్స్ సీన్స్లోఅల్లు అర్హ యాక్టింగ్.. ఆమె పలికే డైలాగ్స్ ముచ్చటగొలుపుతాయి. మొత్తంగా శాకుంతల - దుష్యంతుల ప్రేమ కథను తెరపై ఓ అద్భుత దృశ్య కావ్యంలా ఆవిష్కరించడంలో గుణశేఖర్ ఆకట్టుకోలేకపోయారనే చెప్పాలి. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మరింత శ్రద్ధ వహించాల్సింది. మణిశర్మ సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాకు ప్లస్. నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి.
బలాలు: సమంత నటన, మణిశర్మ సంగీతం, ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు బలాన్ని ఇచ్చాయి. అవి ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. విజువల్ ట్రీట్ కూడా బాగానే ఉందని అంటున్నారు.