హీరో రామ్పోతినేని, కమల్‌హాసన్‌తో సినిమా చేసే విషయంపై క్లారిటీ ఇచ్చేశారు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మేనన్. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన తమిళంలో తీసిన సినిమాలు చాలా వరకు తెలుగులో మరో కథానాయకుడితో రీమేక్ అవుతుంటాయి. ఈసారి మాత్రం శింబుతో తీసిన 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' సినిమాను మాత్రం తమిళంతోపాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీస్రవంతి మూవీస్ ఈ నెల 17న చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సందర్భంగా గౌతమ్ మేనన్ విలేకర్లతో ముచ్చటించారు.
"ఓటీటీ వేదికల రాకతో ప్రపంచం... సినిమా పరిశ్రమలు చాలా చిన్నవైపోయాయి. ప్రేక్షకులు ఇప్పుడు అన్ని భాషల సినిమాలు చూస్తున్నారు. అందుకే దీన్ని రీమేక్ ఆలోచన లేకుండా... ఒకేసారి అన్ని భాషలకీ చేరువ చేయాలనుకున్నా. నేను, శింబు కలిసి ఇదివరకు రొమాంటిక్ చిత్రాలు చేశాం. వాటితో పోలిస్తే ఇది చాలా భిన్నం. గ్యాంగ్‌స్టర్ కథ. చిన్న పల్లెలో జీవించే ముత్తు అనే యువకుడు కొన్ని కారణాలతో ముంబయి వెళతాడు. అతడు చీకటి ప్రపంచంలోకి ఎలా వెళ్లాడు? ఆ తర్వాత ఏమైందనేదే సినిమా. శింబుతో మొదట ప్రేమకథనే చేయాలనుకున్నా. అందుకోసం రెహమాన్ ఒక పాటను కూడా సిద్ధం చేశాడు. నెల రోజుల్లో చిత్రీకరణ మొదలవుతుందనగా తమిళంలో పేరున్న రచయిత జయమోహన్‌ను వేరే చిత్రం కోసం కలిశా. ఆయన 15 నిమిషాల ఓ చిన్న కథని చెప్పారు. ఆ తర్వాత పది రోజుల్లో వంద పేజీల స్క్రిప్ట్ ఇచ్చారు. ముత్తు కథ చదువుతుంటే విజువల్స్ కళ్ల ముందు మెదిలాయి. అప్పుడు ప్రేమకథను పక్కన పెట్టేసి ఈ గ్యాంగ్‌స్టర్ సినిమా చేయాలని నిర్ణయించా" అని అన్నారు.