ఒకప్పుడు బాలీవుడ్ అంటే విజయాలే విజయాలు.. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం దక్షిణాది హవా నడుస్తోంది. హిందీ చిత్ర పరిశ్రమలో విజయాలు తగ్గడానికి కారణం.. సంస్కృతి మూలాల్లోకి వెళ్లకపోవడమే అంటున్నారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. ఆయన దర్శకత్వం వహిస్తున్న 'దోబారా' ట్రైలర్ విడుదల కార్యక్రమం బుధవారం ముంబయిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ "చాలామంది దర్శకులకు తాము సినిమా రూపొందించే భాష కూడా రాదు. ఇది సినిమాపై ప్రభావం చూపిస్తుంది. ఇంగ్లిష్ తప్ప హిందీ మాట్లాడటం రాని వాళ్లు హిందీ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాంటప్పుడు వాళ్లు కథ మూలాల్లోకి వెళ్లడం ఎలా సాధ్యం?" అన్నారు. అనురాగ్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'దోబారా' మిస్టరీ డ్రామాగా తెరకెక్కింది. ఆగస్టు 19న విడుదల కానుంది.
'డైరెక్టర్లకు భాష కూడా తెలీదు.. అందుకే బాలీవుడ్లో ఫ్లాప్స్' - అనురాగ్ కశ్యప్
వరుస పరాజయాలతో డీలా పడిపోతున్న బాలీవుడ్ పరిస్థితిపై ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించారు. సినిమా రూపొందించే భాష కూడా తెలియని వ్యక్తులు మెగాఫోన్ పట్టుకోవడం వల్లే బాలీవుడ్లో సినిమాలు ఆడట్లేదని అన్నారు. భాష రానప్పుడు వాళ్లకు కథ మూలాల్లోకి వెళ్లడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
అన్నయ్య దర్శకత్వంలో..: మాస్ మసాలా చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద భారీ విజయాలు అందుకున్న సోనాక్షి సిన్హా వైవిధ్య కథా చిత్రాల వైపు అడుగులు వేస్తోంది. తాజాగా ఆమె తన సోదరుడి చిత్రంలో నటించింది. ఆమె కవల సోదరుల్లో ఒకరైన ఖుష్ సిన్హా 'నిఖితా రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో తను నటిస్తున్న విషయాన్ని ప్రకటిస్తూనే తన పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్‌ను పంచుకుంది సోనాక్షి. "ఓ మంచి చిత్రానికి ఖుష్, నేను కలిసి పనిచేయాలనుకున్నాం. మా ఇద్దరికి బాగా నచ్చిన ఈ కథతో మీ ముందుకు వస్తున్నాం" అని చెప్పింది సోనాక్షి. "సోనా మంచి నటి. ఆమె సినిమాలు చూస్తూ పెరిగాను. ఆమె సినిమా ప్రయాణంలో నేను భాగమైనందుకు సంతోషంగా ఉంది" అని చెప్పారు ఖుష్. పరేష్‌రావల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ చూడండి :బ్రేకప్ చెప్పేసుకున్న మరో బిగ్బాస్ జంట..