ఒకరిని తక్కువ, ఎక్కువ చేసి మాట్లాడడం, వివాదంలోకి వెళ్లడం తనకు ఇష్టం ఉండదని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ప్రేక్షకులకు మంచి సినిమాలను అందించడం కోసం పరితపిస్తానని చెప్పారు. ఇటీవల ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. తమిళ నటుడు విజయ్‌ని నంబరు 1 స్టార్‌గా ఆయన అభివర్ణించారంటూ అజిత్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వివాదానికి తెర తీశారు. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో అది హాట్ టాపిక్ మారింది. 'బలగం' సినిమా టైటిల్ పోస్టర్ విడుదల వేడుకకు హాజరైన దిల్ రాజు దానిపై స్పందించారు. ''నా ఇంటర్వ్యూకు సంబంధించి 20 సెకన్ల వీడియోను కట్ చేసి పోస్ట్ చేశారు. దానికి ముందు, వెనకా ఇంకా మ్యాటర్ ఉంది. అది పూర్తిగా చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఇది నా విన్నపం'' అని పేర్కొన్నారు.
'ఎవరినీ తక్కువ చేసి మాట్లాడను.. అసలు 'వారిసు' విజయ్‌తో చేయాల్సింది కాదు..' - వారసుడు సినిమా రిలీజ్ తేది
ఇటీవల విజయ్, అజిత్ గురించి తాను చేసిన వ్యాఖ్యల పట్ల ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. తాను ఎవరినీ తక్కువ చేసిన మాట్లాడను అని అన్నారు. అసలు 'వారిసు' సినిమా.. విజయ్‌తో చేయాల్సింది కాదని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే?
సమస్య ఏంటి?
తమిళ నటుడు విజయ్ హీరోగా 'వారిసు' (తెలుగులో వారసుడు) చిత్రాన్ని నిర్మిస్తున్నారు దిల్ రాజు. ఈ సినిమాను 2023 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఇది తమిళ సినిమా అని, సంక్రాంతి, దసరా సీజన్‌లకు తెలుగు చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలనేది టాలీవుడ్‌కు చెందిన పలువురు నిర్మాతల వాదన. దీనిపై ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు లేఖలు రాశాయి. తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని 2017లో తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేశాయి. తెలుగు అగ్ర హీరోలు చిరంజీవి (వాల్తేరు వీరయ్య), బాలకృష్ణ (వీర సింహారెడ్డి) సినిమాలు, తమిళ నటుడు అజిత్ హీరోగా రూపొందిన 'తునివు' చిత్రం సంక్రాంతి సీజన్‌కే విడుదల కానున్నాయి.
మహేశ్‌బాబుతో చేయాలనుకున్నాం..
దిల్ రాజు మరో ఇంటర్వ్యూలో 'వారిసు'విశేషాలు పంచుకున్నారు. ఆ సినిమాలో హీరోగా ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదని తెలిపారు. ''దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ కథ చెప్పినప్పుడు మహేశ్‌బాబుతో దీన్ని చేయాలనుకున్నాం. అప్పటికే మహేశ్ మరో ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. అందువల్ల సినిమా కాస్త ఆలస్యమయ్యేలా అనిపించింది. ఆ తర్వాత రామ్‌చరణ్‌ను కలిసి కథ వినిపించాం. కానీ, అప్పటికే నా బ్యానర్‌లో చరణ్- దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా ఖరారైంది. ఆ సమయంలో అల్లు అర్జున్, ప్రభాస్ కూడా బిజీగా ఉన్నారు. దాంతో విజయ్‌ని కలిసి కథ చెప్పాం. కంటెంట్ నచ్చడంతో ఆయన వెంటనే ఓకే చేశారు'' అని దిల్ రాజు వివరించారు. 'బీస్ట్' తర్వాత విజయ్ నటిస్తోన్నచిత్రమిది. విజయ్ సరసన రష్మిక సందడి చేయనున్నారు.