మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మధ్య తరగతి కుటుంబం నుంచి కొణిదెల శివశంకర వర ప్రసాద్‌గా చిత్రపరిశ్రమకు వచ్చిన ఆయన.. తన నటనతో మెగాస్టార్‌గా ఎదిగారు. స్వయంకృష్టితో ఎదిగిన ఆయన.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాల్లోకి రావాలనుకునే ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. అయితే ఎన్నో చిత్రాల్లో నటించిన చిరు.. డైరెక్ట్ కూడా చేశారని మీకు తెలుసా? అవును మీరు చదివింది నిజమే. కాకపోతే పూర్తిస్థాయిలో కాదు. ఈ విషయాన్ని సీనియర్ నటుడు తనికెళ్ల భరణి చెప్పారు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ మధ్య వరుస వీడియోలు పోస్ట్ చేస్తున్నారు తనికెళ్ల భరణి. సినీ ప్రముఖుల గురించి ఆసక్తికర విషయాలు, వారితో తనకున్న అనుబంధాన్ని తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో చిరంజీవిని ప్రశంసిస్తూ ఓ కవిత కూడా చెప్పారు.
"చిరంజీవి.. ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎవరి అండా లేకుండా స్వయంకృషితో మెగాస్టార్ అయ్యారు. ఆయన ఎంతో మంది స్ఫూర్తి. చిరంజీవిని మా గురువు రాళ్లపల్లి గారు మొదట పరిచయం చేశారు. 'కుక్కకాటుకి చెప్పు దెబ్బ' అనే సినిమా షూటింగ్ సమయంలో నాకు చిరును పరిచయం చేశారు. అదే నేను తొలిసారి చిరంజీవిని చూడటం. ఆ తర్వాత చాలా సినిమాల్లో కలిసి నటించాం. అందులో ఓ సినిమా అనుభూతి ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని చిరు గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు తనికెళ్ల భరణి.