LGM Movie Teaser : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్థాపించిన ధోనీ ఎంటర్‌టైన్‍మెంట్ లిమిటెడ్ బ్యానర్ నుంచి తొలి సినిమాగా 'ఎల్‍జీఎం'- లెట్స్ గెట్ మ్యారీడ్ వస్తోంది. ఈ చిత్రాన్ని ధోనీ సతీమణి సాక్షి సింగ్ ధోనీ సమర్పిస్తున్నారు. తమిళంలో మూవీ రూపొందింది. కానీ తెలుగులోనూ విడుదల కానుంది. బుధవారం (జూన్ 7) ఈ మూవీ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. తెలుగులోనూ టీజర్ వచ్చింది.
యూత్‍ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్!
'ఎల్‍జీఎం' చిత్రం యూత్‍ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తాజా టీజర్ చూస్తే అర్థమవుతోంది. కామెడీ కూడా ప్రధానాంశంగా ఉండనుంది. పెళ్లి విషయంలో ప్రేయసి, తల్లి మధ్య నలిగిపోయే ఓ యువకుడి కథగా ఈ మూవీ ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఎల్‍జీఎం సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీంతో టీజర్‌తో ప్రమోషన్‍లను చిత్రయూనిట్ ప్రారంభించింది.
యంగ్‌హీరో- లవ్‌టుడే బ్యూటీ!
LGM Movie Cast : 'ఎల్‍జీఎం' సినిమాలో తమిళ యువ నటుడు హరీశ్ కల్యాణ్ హీరోగా నటిస్తున్నారు. లవ్‌టుడే ఫేమ్ ఇవానా.. హీరోయిన్గా కనిపించనున్నారు. సీనియర్ నటి నదియా, ప్రముఖ కమెడియన్ యోగి బాబు, ఆర్జే విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రమేశ్ తమిళ్‍మణి దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్షన్‍తో పాటు సంగీత దర్శకత్వం, కథ, స్క్రీన్ ప్లే, మాటల రచన బాధ్యతలను కూడా తమిళ్‍మణి నిర్వర్తిస్తున్నారు.
ధోనీ బ్యానర్.. ఫస్ట్ సినిమా..
Dhoni Entertainment 1st Movie : ధోనీ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ నుంచి తొలి సినిమా కావడంతో 'ఎల్‍జీఎం'పై చాలా ఆసక్తి నెలకొంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. అయితే ప్రస్తుతం తమిళం, తెలుగు టీజర్లను విడుదల చేసింది. అయితే, విడుదల తేదీని ఇంకా వెల్లడించలేదు. కమింగ్ సూన్ ఇన్ సినిమాస్ అని పేర్కొంది.
IPL 2023 Winner CSK : కాగా, ఈ ఏడాది ఐపీఎల్‍లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టైటిల్ అందించాడు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. అనంతరం మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం రాంచీలోనూ తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ ఎల్‍జీఎం మూవీ ప్రమోషన్లు త్వరలో ముమ్మరంగా జరిగే ఛాన్స్ ఉంది. భవిష్యత్తులో ఈ మూవీ ప్రమోషన్లలో ఎంఎస్ ధోనీ పాల్గొనే ఛాన్స్ కూడా ఉంది.