Dhanush Sir Movie : ధనుష్ - వెంకీ అట్లూరి కలయికలో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్తా మేనన్ కథానాయిక. ఈ చిత్రానికి తెలుగులో 'సార్', తమిళంలో 'వాతి' అనే టైటిల్స్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇది ఈఏడాది డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ కొత్త పోస్టర్‌ను నెట్టింట పంచుకుంది.
ఆ పోస్టర్‌లో ధనుష్ క్లాస్ రూంలో టేబుల్‌పై కూర్చొని.. విద్యార్థులకు గణితం బోధిస్తూ కనిపించారు. "డిసెంబరు 2 నుంచి ఈ సార్ తరగతులు వినడానికి అందరూ సిద్ధంగా ఉండండి" అంటూ ఆ ఫొటోకు ఓ వ్యాఖ్యను కూడా జోడించారు. విద్యా వ్యవస్థ తీరు తెన్నుల మీదుగా కథానాయకుడు సాగించే ప్రయాణమే ఈ చిత్ర కథ. ఈ ప్రయాణంలో సార్‌కు ఎదురైన సమస్యలు, సంఘటనలు ఆయన జీవితాన్ని ఏ తీరానికి చేర్చాయన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి.వి.ప్రకాష్ స్వరాలందిస్తుండగా.. జె.యువరాజ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఇదో కొత్త 'ప్రేమదేశం'
"చిన్న వయసులో హీరో కావడంతో కాలేజీ రోజుల్ని మిస్ అయ్యాను. ఈ సినిమా నాకు ఆ రోజుల్ని గుర్తు చేసింది" అన్నారు త్రిగుణ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'ప్రేమదేశం'. మేఘా ఆకాష్ కథానాయిక. మాయ, అజయ్ కతుర్వార్ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వం వహించారు. శిరీష సిద్ధమ్ నిర్మాత. మణిశర్మ స్వరకర్త. అక్టోబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా త్రిగుణ్ మాట్లాడుతూ "తల్లి కొడుకుల బంధం నేపథ్యంలో నేను చేసిన సినిమాలు నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇందులో నాకు అమ్మగా మధుబాల నటించారు. మేఘ ఆకాష్‌తో మరోసారి కలిసి నటించడం ఆనందంగా ఉంది" అన్నారు. ఈ చిత్రంలోని 'తెలవారెనే సామి..' అంటూ సాగే పాటని సోమవారం విడుదల చేశారు.