Devil Movie Review :సినిమా: డెవిల్ ; నటీనటులు: కల్యాణ్ రామ్, సంయుక్త, మాళవిక నాయర్, సీత, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, ఎస్తర్ నోరోన్హా తదితరులు; సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్, ఎడిటింగ్: తమ్మిరాజు; స్టోరీ, స్క్రీన్‌ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా; నిర్మాత, దర్శకత్వం: అభిషేక్ నామా; నిర్మాణ సంస్థ: అభిషేక్ పిక్చర్స్; సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్; విడుదల: 29-12-2023.
2023 ఆఖరి శుక్రవారం రిలీజైన సినిమాల్లో డెవిల్ ఒకటి. నందమూరి కల్యాణ్ రామ్- సంయుక్త మేనన్ ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటించారు. డైరెక్టర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించారు. మరి ఈ సినిమా ప్రేక్షుకలను మెప్పిచ్చిందా?
కథేంటంటే:1940ల్లో జరిగే కల్పిత కథ ఇది. నాటి బ్రిటిష్ ప్రభుత్వం భారత స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్‌ని పట్టుకోవాలనే ప్రయత్నంలో ఉంటుంది. హీరో డెవిల్ (కల్యాణ్‌రామ్) బ్రిటిష్ ప్రభుత్వంలో సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న సమయంలోనే బోస్ రాక గురించి ప్రభుత్వానికి సమాచారం అందుతుంది. రసపురంలోని జమిందార్ ఇంట్లో జరిగిన ఓ హత్య కేసుని ఛేదించడానికి ప్రభుత్వం డెవిల్‌ని పంపుతుంది.
హత్య కేసు దర్యాప్తులో సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో నడుస్తున్న ఐఎన్ఏ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) ఏజెంట్లను గుర్తిస్తాడు డెవిల్. మరోవైపు, బోస్ తన కుడి భుజమైన త్రివర్ణతో టచ్‌లో ఉన్న విషయాన్ని డెవిల్ పసిగడతాడు. సుభాష్ చంద్రబోస్‌కి కోడ్ రూపంలో ఓ సమాచారాన్ని చేరవేసేందుకు త్రివర్ణ, మరికొద్ది మంది ఐఎన్ఏ ఏజెంట్లు ప్రయత్నిస్తుంటారు. మరి ఆ కోడ్‌తో జమిందార్ ఇంట్లో హత్యకు సంబంధం ఏమిటి? ఎన్నో చిక్కుముడులున్న ఈ కేసుని డెవిల్ ఎలా ఛేదించాడు? అసలు ఈ కథలో త్రివర్ణ ఎవరు? నైషధ (సంయుక్త), మణిమేకల (మాళవిక నాయర్)తో ఆమెకు సంబంధం ఏమిటి? బోస్‌ని బ్రిటిష్ ప్రభుత్వం పట్టుకుందా? తదితర విషయాలను తెరపై చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే: కల్యాణ్‌రామ్ తన యాక్టింగ్, లుక్‌తో ఆట్రాక్ట్ చేశారు. యాక్షన్ సీన్స్‌లో తనదైన శైలిలో మెప్పించారు. అయితే 'డెవిల్' పాత్రని మరింత బలంగా తీర్చిదిద్దే విషయంలోనే కొన్ని లోపాలు కనిపిస్తాయి. సంయుక్త, మాళవిక నాయర్ ఇంపార్టెంట్ రోల్స్‌లోనే నటించారు. వారి పాత్రలు దేశభక్తి కోణంతో ఉంటాయి. కల్యాణ్‌రామ్-సంయుక్త పాత్రల మధ్య లవ్‌ట్రాక్‌ను దర్శకుడు బలంగా చూపించలేకపోయారు. శాస్త్రి పాత్రలో సత్య, కీలకమైన మలుపునిచ్చే పాత్రలో వశిష్ట సింహా, షఫి, రంగస్థలం మహేశ్ తదితరులు పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. టెక్నికల్‌గా కెమెరా వర్క్‌కే ఎక్కువ మార్కులు పడతాయి. సౌందర్‌రాజన్ తన కెమెరాతో పీరియాడిక్ నేపథ్యాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. రామకృష్ణ, మోనిక కళా ప్రతిభ ఆకట్టుకుంటుంది. శ్రీకాంత్ విస్సా కథ, మాటలు మెప్పిస్తాయి. దర్శకుడి పట్టు కొన్ని సన్నివేశాలపైనే కనిపిస్తుంది.