తెలంగాణ

telangana

ఆ సంఘటనతో తీవ్ర డిప్రెషన్​లోకి వెళ్లిపోయా!: శిల్పాశెట్టి

By

Published : Apr 17, 2022, 7:30 AM IST

Updated : Apr 17, 2022, 11:50 AM IST

మాతృత్వం గొప్ప అనుభూతి!.. దాన్ని ఆస్వాదించే సమయంలో కొన్ని సమస్యలూ ఎదురవుతాయి.. వాటిని ఎలా అధిగమించాలో తెలియక... ఎవరితో చెప్పుకోవాలో అర్థంకాక కొత్తగా తల్లైనవాళ్లు సతమతమవుతుంటారు. బేబీ బ్లూస్‌ లేదా ప్రసవానంతర కుంగుబాటుని ఎదుర్కొన్న కొంతమంది సెలబ్రిటీలు దాన్ని ఎలా అధిగమించారో చెప్పుకొచ్చారు...

problems and tips after delivery shilpa shetty
problems and tips after delivery shilpa shetty

మహిళా జీవితంలో తల్లిగా మారడం ఓ మధురమైన అనుభూతి. కానీ దాన్ని ఆస్వాదించే సమయంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఎందరో మహిళలు సతమతమవుతుంటారు. మానసిక కుంగుబాటుకు గురౌతారు. అయితే ఈ సమస్యలను ఎలా అధిగమించారో కొంతమంది సినీతారలు చెప్పుకొచ్చారు. వారు ఏమన్నారంటే..

నేనేమన్నా ఆవునా అనుకొన్నా.. శిల్పాశెట్టికి వియాన్‌, సమీషా ఇద్దరుపిల్లలు. పెద్దపిల్లాడు వియాన్‌ పుట్టినప్పుడు తల్లిగా చాలా పాఠాలనే నేర్చుకున్నా అంటోంది శిల్పా. ‘రోజంతా వాడికి పాలివ్వడంతోనే సరిపోయేది. విసిగిపోయి... ఒక్కోసారి నేనేమన్నా ఆవునా, గేదెనా అనుకొనేదాన్ని. దానికి తోడు డెలివరీకి ముందే 32 కేజీలు అదనపు బరువు పెరిగాను. డెలివరీ అయ్యాక మరికాస్త పెరిగాను. మెడ, నడుమునొప్పి.. మోకాళ్ల నొప్పులు బాధించేవి. వీటన్నింటితో రెండువారాలు తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. వియాన్‌ని తీసుకొని మొదటిసారి డిన్నర్‌కోసం బయటకు వెళ్లాను. అక్కడ కిట్టీపార్టీకి వచ్చిన కొంతమంది... ‘శిల్పాయేనా? ఏమాత్రం తగ్గట్లేదుగా! అన్నారు’ వెటకారంగా నాకు వినబడేట్టు. బాధనిపించింది. ఆ పరిస్థితుల నుంచి అమ్మే నన్ను బయటకు తెచ్చింది. ‘శిల్పా వర్కవుట్లు ఎప్పటి నుంచి మొదలుపెడుతున్నావ్‌ అంది?’ అప్పుడే నేను ఆహారంపై దృష్టిపెట్టా. చిన్నప్పుడు అమ్మమ్మ సింపుల్‌గా కరివేపాకు పోపు వేసి బీన్స్‌ కూరని కూడా అద్భుతంగా చేసేది. పెళ్లయ్యాక పంజాబీ వంటకాలు బాగా అలవాటయ్యాయి. ముఖ్యంగా బరువుని పెంచే ఆలూపరాటా, వెన్నతో ఉండే మక్కీకీ రోటీ లేకుండా రోజు గడిచేది కాదు. నెమ్మదిగా కార్బోహైడ్రేట్లు తగ్గించి కాయగూరలు, ప్రొటీన్‌పై దృష్టిపెట్టాను. సరైన పద్ధతిలో వ్యాయామాలు చేస్తూ... నెమ్మదిగా బరువు తగ్గి డిప్రెషన్‌ దూరమయ్యా’ అంటుంది శిల్ప.

అకారణంగా ఏడ్చేదాన్ని.. ‘పిల్లలు పుట్టగానే వాళ్లపై తల్లికి అంతులేని ప్రేమ పుట్టుకురావాలి’.. ఈ అభిప్రాయం తప్పు అంటుంది నలభైరోజలు పాటు పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌ పరిస్థితిని అనుభవించిన మందిరాబేడి. ‘ఈ రోజు ప్రపంచంలో నాకు అందరికంటే ఇష్టమైన వాళ్లు ఎవరంటే నేను నా కొడుకు వీర్‌ పేరు చెబుతాను. కానీ వాడిని నేను 40 రోజుల పాటు ప్రేమగా దగ్గరకు తీసుకోలేకపోయాను అంటే నమ్ముతారా? బాబు పుట్టిన నెలన్నర వరకూ కారణం లేకుండా ఏడుస్తూనే ఉండేదాన్ని. అర్ధరాత్రి ఏడుస్తుంటే అమ్మ, మావారు ఓదార్చి, సర్దిచెప్పేవారు. ఇంట్లోనే ఉండేదాన్ని.. ఒకదాని తర్వాత ఒకటి వాడికి డైపర్లు మారుస్తూ. వ్యాయామం, నడక లేవు. ఇక అలా ఉండటం నా వల్ల కాలేదు. ఒక రోజు బయట బోరున వర్షం కురుస్తున్నా తడుస్తూనే వెళ్లి వర్క్‌వుట్లు మొదలుపెట్టా. వ్యాయామాన్ని ఒక థెరపీలా భావించాను. ‘ఈ కష్టం కూడా కరిగిపోతుందని’ నాకు నేను సర్దిచెప్పుకొన్నా. నెమ్మదిగా ఈ సమస్య నుంచి బయటపడ్డాను. నా కొడుకు వీర్‌ అంటే ఇప్పుడు నాకు ప్రాణం’ అంటోంది మందిరా.

అమ్మ గుర్తించింది... చాలామంది ఈ పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌ మొదటికాన్పు తర్వాతే వస్తుందనుకుంటారు. కానీ రెండోసారీ రావడానికీ ఆస్కారం ఉందని చెబుతోంది ఇషాడియోల్‌. ‘మొదట రాధ్య... తర్వాత మిరాయా పుట్టారు. తొలిసారి ఏ ఇబ్బందీ లేదు. రెండో పాప పుట్టినప్పుడు అందరూ సంతోషంగా ఉంటే నేను మాత్రం ఏడ్చేదాన్ని. అకారణంగా! పాప ఏడిస్తే.. దాంతోపాటు నేనూ భోరుమనేదాన్ని. అమ్మ హేమమాలిని నా సమస్యని గుర్తించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయించి, కౌన్సెలింగ్‌ ఇప్పించింది. హార్మోన్లలో వచ్చిన తేడా వల్లనే ఇలా అవుతోందని చెప్పారు. నెమ్మదిగా ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి ప్రయత్నించాను. రాధ్యకి పాలుపట్టడానికీ, తనతో ఆడుకోవడానికి చాలా సమయం ఉండేది. కానీ మిరాయాకి ఆ సమయం దొరికేది కాదు. రాధ్య పేరుకే పెద్దదికానీ అదీ చిన్నపిల్లే కదా! వీళ్లిద్దరికీ సరైన సమయం కేటాయించలేక సతమతమవుతున్నప్పుడు మావారి సాయం తీసుకొన్నా. ముఖ్యంగా విటమిన్లు అందే ఆహారం తీసుకొనే సరికి నెల రోజుల్లో పరిస్థితి చక్కబడింది’ అంటుంది ఇషాడియోల్‌.

ఇదీ చూడండి:

Alia Bhatt Citizenship: ఆలియా భట్​ది భారత్​ కాదట- ఏ దేశమో తెలుసా?

విలన్​ లేకుంటే హీరో ఎక్కడి నుంచి వస్తాడు: సంజయ్‌దత్‌

Last Updated : Apr 17, 2022, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details