బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ నటించిన 'బ్రహ్మాస్త్రం' ట్రైలర్ బుధవారం విడుదలైంది. ట్రైలర్‌కు మిశ్రమ స్పందన వస్తున్నా.. ఓ పాత్ర గురించి మాత్రం సామాజిక మాధ్యమాల్లో తెగ చర్చ నడుస్తోంది. అదే సూపర్‌స్టార్ షారుక్ ఖాన్‌కు సంబంధించిన ఓ సీన్! ఆ పాత్రను ట్రైలర్లో రివీల్ చేయకున్నా.. ఓ సీన్లో వెనకవైపు నుంచి కనిపించేది ఆయనే అంటూ బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో షారుక్.. ఓ శాస్త్రవేత్త పాత్రలో మెరవనున్నట్లు తెలుస్తోంది.
అయితే మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే 'బ్రహ్మాస్త్రం'లో.. రణ్‌బీర్ మాజీ ప్రేయసి, అగ్రతార దీపికా పదుకొణె కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు దీపిక ఓకే చెప్పిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ సమాచారమే నిజమైతే.. వివాహం అనంతరం వీరు కలిసి నటిస్తున్న సినిమా ఇదే అవుతంది.