Deepika padukone Maheshbabu NTR: స్టార్ హీరోయిన్ స్టేటస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి దీపికా పదుకొణె. వరుస అవకాశాలూ, విజయాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న దీపిక... త్వరలో తెలుగు తెరమీదా కనిపించనుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకునే ఈ బాలీవుడ్ భామ... తన మనసులోని ముచ్చట్లను వివరిస్తోందిలా..
రెండు నిమిషాల్లోనే...రణ్‌వీర్ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు కానీ... తనపైన నాకు ఒకే ఒక్క విషయంలో కోపం వస్తుంది. చాలా త్వరగా భోజనం పూర్తిచేస్తాడు. నాకేమో కబుర్లు చెప్పుకుంటూ నిదానంగా భోజనం చేయాలని ఉంటుంది కానీ... నేను రెండు ముద్దలు తినేలోపు గబగబా తినేసి ప్లేటు పక్కన పెట్టేస్తాడు. అదే నాకు నచ్చదు. ఆ మూడూ ఉంటాయి... నేనెప్పుడూ నా హ్యాండుబ్యాగులో సూదీ-దారం, పిన్నులూ పెట్టుకుంటా. ఎందుకంటే.. రణ్‌వీర్ ఎప్పుడూ రకరకాల ఫ్యాషన్లను ప్రయత్నిస్తుంటాడు. పైగా ఎక్కడికి వెళ్లినా సరదాగా గెంతుతూ, ఏవో ఒక స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తాడు. అలా చేస్తున్నప్పుడు తన డ్రెస్ చిరిగితే కుట్టడానికే ఆ మూడింటినీ నా హ్యాండుబ్యాగులో ఎప్పుడూ ఉంచుకుంటా. అతనితో నటించాలని.. నాకు అవకాశం వస్తే గనుక జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో కలిసి సినిమాలు చేయాలని ఉంది. వాళ్ల వ్యక్తిత్వం, నటించే తీరు, డ్యాన్స్ చేసే విధానం చూశాక వాళ్లతో కలిసి తెర పంచుకోవాలని ఎవ్వరైనా అనుకుంటారు. నేనూ అదే కోరుకుంటున్నా. చూడాలి మరి.. భవిష్యత్తులోనైనా ఆ అవకాశం వస్తుందో రాదో..
దీపావళి అంటే ఇష్టం..మా ఇంట్లో అందరి పేర్లకూ వెలుగు, దీపం అనే అర్థం వస్తుంది. అందుకే నాకు దీపావళి పండుగంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు దీపావళి రోజున సాయంత్రం చుట్టుపక్కల పిల్లలతో కలిసి బోలెడు టపాకాయలు కాల్చేదాన్ని. ఇప్పటికీ దీపావళి పండుగ వస్తోందంటే నాకు నా చిన్నతనమే గుర్తొస్తుంది.