David Warner Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్ ట్రోఫీని అందించిన ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌కు మరో అవమానం జరిగింది. 2021లో కెప్టెన్సీ నుంచి తప్పించి అవమానించిన సన్‌రైజర్స్ మరోసారి అలాంటి పనే చేసింది. ఐపీఎల్ వేలం జరుగుతన్న వేళ వార్నర్‌ను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ఖాతాల్లో బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా వార్నరే స్క్రీన్ షాట్స్ తీసి మరీ నెట్టింట వెల్లడించాడు. దీన్ని చూసిన క్రికెట్ లవర్స్ సన్‌రైజర్స్ ఫ్రాంచైజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే ?
ఐపీఎల్ 2024 మిని వేలంలో ఆసీస్ ప్లేయర్లు పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ అత్యధిక ధరకు దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆ ఇద్దరు ప్లేయర్లుకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పేందుకు వార్నర్ ప్రయత్నించాడు. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వార్నర్‌ను సామాజిక మాధ్యమాల్లో బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని వార్నర్ స్క్రీన్ షాట్ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
'ట్రావిస్ హెడ్ షేర్ చేసిన పోస్ట్‌ను రీ పోస్ట్ చేయాలని ప్రయత్నించాను. కానీ సన్‌రైజర్స్ నన్ను బ్లాక్ చేసింది.' అంటూ డేవిడ్ వార్నర్ పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులు అందరూ సన్‌రైజర్స్ ఫ్రాంచైజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.