తెలంగాణ

telangana

ఓటీటీ రిలీజ్​కు 'దసరా' రెడీ.. Netflixలో ఎప్పటి నుంచంటే?

By

Published : Apr 20, 2023, 10:49 AM IST

థియేటర్లలో దుమ్మురేపిన నాని నటించిన 'దసరా' సినిమా.. ఈ నెలలోనే ఓటీటీలో సందడి చేయనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి అంటే?

dasara ott release in netflix on april 27
dasara ott release in netflix on april 27

'దసరా' సినిమాతో థియేటర్లలో ధూమ్ ధామ్ చేసిన నేచురల్ స్టార్ నాని (Nani)... అతి త్వరలో, ఈ నెలలోనే ఓటీటీలో సందడి చేయనున్నారు. తెలంగాణలోని గోదావరిఖని బొగ్గు గనుల ప్రాంతంలోని ఓ పల్లెలో జరిగిన కథతో రూపొందిన ఈ సినిమా మార్చి 30న థియేటర్లలో విడుదల అయ్యింది. వచ్చే వారం ఓటీటీలోకి రానుంది.

ఏప్రిల్ 27న ఓటీటీలో 'దసరా'
'దసరా' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నెల 27న విడుదల చేయనుంది. ఈ విషయాన్ని ఓ ప్రత్యేక పోస్టర్​తో ప్రకటించింది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తోందీ సినిమా.

సినిమా విషయానికొస్తే.. 'దసరా'లో కీర్తీ సురేశ్​ కథానాయిక. దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటించారు. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమైన చిత్రమిది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు రాబట్టింది.

నెట్​ప్లిక్స్​లో దసరా

'దసరా' కథ ఏంటి?
ముక్కోణపు ప్రేమకథగా మొదలైన 'దసరా' తర్వాత మహిళలను చెరబట్టే ఓ కామ పిశాచిని కథానాయకుడు ఎలా అంతం చేశాడు? మద్యపానానికి మగవాళ్ళు బానిసలు కావడంతో మహిళలు పడుతున్న సమస్యలను హీరో ఎలా అంతం చేశాడు? అనే అంశాలతో ముగిసింది.

తెలంగాణలో సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో ఉన్న వీర్లపల్లి అనే గ్రామంలో జరిగే కథ ఇది. ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి) వాళ్ల స్నేహితులతో కలిసి బొగ్గు రైళ్లు కొల్లగొడుతూ ఉంటారు. ధరణి, సూరిల చిన్నప్పటి స్నేహితురాలు వెన్నెల (కీర్తి సురేశ్​) వీర్లపల్లి లోనే అంగన్ వాడి టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. వెన్నెలని ధరణి ప్రేమిస్తాడు. కానీ సూరి కూడా ప్రేమించడంతో ధరణి త్యాగం చేస్తాడు. ఊర్లో ఉన్న సిల్క్ బార్ కారణంగా వీరి జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతాయి. చివరికి వీర్లపల్లిలో ఏం జరిగింది? ఈ కథలో రాజన్న (సాయి కుమార్), చిన్న నంబి (షైన్ టామ్ చాకో), శివన్న (సముద్ర ఖని) పాత్రలు ఏంటి? అనేవి తెలియాలంటే దసరా చూడాల్సిందే.

వంద కోట్లు వసూలు చేసిన 'దసరా'
కథానాయకుడిగా నేచురల్ స్టార్ నాని స్థాయిని ఓ మెట్టు పైకి ఎక్కించిన సినిమాగా 'దసరా' చరిత్రకు ఎక్కింది. వంద కోట్లు వసూలు చేసిన సినిమాగా నిలించింది. తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తెలంగాణలో 'దసరా'కు మంచి ఓపెనింగ్ లభించింది. మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాకు నైజాంలో 6.21 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. నట సింహం బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' సినిమా రూ. 6.10 షేర్ కలెక్ట్ చేసింది. ఈ రెండు కంటే కంటే అర కోటి ఎక్కువ కలెక్ట్ చేసింది నాని 'దసరా'. ఆ సినిమాకు నైజాంలో ఫస్ట్ డే రూ. 6.78 కోట్ల షేర్ వచ్చింది. విదేశాల్లో కూడా 'దసరా'కు మంచి వసూళ్లు దక్కాయి.

ABOUT THE AUTHOR

...view details