Choreographer Sekhar Master: డ్యాన్స్.. డ్యాన్స్.. డ్యాన్స్.. ఇదే ఆశగా.. శ్వాసగా సాగిపోతుంటారాయన. తాను చేసే ప్రతి పాటలోనూ ఏదో కొత్తదనం ఉండాలని పరితపిస్తుంటారు. 'జబర్దస్త్'కు వెళ్తే, కంటెస్టెంట్‌లతో కలిసిపోయి 'శేకు'గా నవ్వులు పంచుతారు. అటు అగ్ర హీరోలతో ఇటు యువ హీరోలతోనూ తనదైన శైలిలో స్టెప్‌లు వేయించి వెండితెరను 'షేక్' చేసేస్తుంటారు. 'ఢీ'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తన కెరీర్‌లో ఎన్నో గెలుపోటములను చవి చూశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన లైఫ్‌లో పడ్డ ఆర్థిక కష్టాలు, కెరీర్ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు.
మొదట్లో రాకేష్ మాస్టర్ దగ్గర పనిచేసినట్లు, అయితే కొద్దికాలమే అన్నారు. అప్పట్లో ఆయన డ్యాన్స్ స్ట్లైల్గా ఉంటుందని చెప్పారు."నేను ఆయన దగ్గర ఉన్న సమయంలో ఆయనకు అంతగా షూటింగ్స్ ఉండేవి కావు. అప్పుడు అయన కేవలం క్లాస్‌లు చెప్పేవారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయనకు మంచి ఛాన్స్‌లు వచ్చాయి" అని అన్నారు. తన డ్యాన్స్‌ను సీనియర్ కొరియోగ్రాఫర్, నటుడు లారెన్స్ ప్రశంసించారని.. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న సాంగ్స్ ఎక్కువగా చేశానని చెప్పారు. తాను మాస్టర్ అయ్యాక పోస్ట్ బాక్స్ సినిమాకు మొదటిసారి కొరియోగ్రాఫర్ చేసినట్లు గుర్తుచేసుకున్నారు. అయితే ఈ చిత్రానికి ఎన్నో సమస్యలు ఎదురైనట్లు చెప్పుకొచ్చారు.