సాధారణంగా సినిమా అనగానే హీరో ఎవరా? అని ఆరా తీస్తారు సినీ ప్రియులు. కొన్ని సందర్భాల్లో కథ మామూలుగానే ఉన్నా.. కథానాయకుడు తన నటనతో ప్రేక్షకులను మెప్పించి హిట్ అందుకున్న సినిమాలు బోలెడు. అయితే కొందరు దర్శకులు స్టోరీ డిమాండ్‌ను బట్టి జంతువులు, పక్షులను సినిమాల్లో వాడుతుంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి 'కాకి' వచ్చి చేరింది. 'బలగం', 'దసరా', 'విరూపాక్ష' సినిమాలు.. కాకి ద్వారా హిట్ టాక్ సొంతం చేసుకున్నాయా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి!
'విరూపాక్ష' మిస్టరీ, థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన చిత్రం. మూఢ నమ్మకాల కోణంలో ఈ సినిమా రూపొందించారు. తాంత్రిక శక్తులు, ఆత్మలతో ప్రేక్షకులను భయపెట్టే విధంగా సినిమా సాగుతోంది. క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలు ఉండటం వల్ల కాకిని ఎక్కువగా చూపే ప్రయత్నం చేశారు. హారర్ సన్నివేశాల్లో ఆడియన్స్‌కు ఆసక్తి కలిగించడానికి కాకిని వాడినట్టు సమాచారం. మూములుగా కాకిని అశుభంగా భావిస్తారు! కానీ ఇప్పుడు ఆ కాకియే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. కాకులే కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాయి. ఇందుకు 'బలగం,' 'దసరా' సినిమాలే స్పష్టమైన ఉదాహరణలు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో హీరోహీరోయిన్ పాత్రల తర్వాత కాకిదే ఇంపార్టెంట్ రోల్ అంట! అంతెందుకు.. హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ సంయుక్త ఫొటోలతో ఉన్న సినిమా పోస్టర్ బ్యాక్గౌండ్ర్ కూడా కాకిదే డామినేషన్. సినిమాలో ఇతర నటీనటుల కంటే కాకి ఎక్కువ ప్రాధాన్యంగా నిలిచింది.