రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు దిల్లీ పాటియాలా హౌస్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఆ బెయిల్ గడువు తేదీని నంవబర్ 10 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.
కాగా, ఈ మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌ను నిందితురాలిగా పేర్కొంటూ ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. సెప్టెంబరు 26న కోర్టు ఎదుట హాజరుకావాలంటూ నటికి సమన్లు జారీ చేసింది. దీంతో జాక్వెలిన్ పాటియాలా హౌస్ కోర్టుకు హాజరై.. మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేసింది.
ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం దీనిపై ఈడీ నుంచి స్పందన కోరింది. రెగ్యులర్ బెయిల్ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున.. అప్పటివరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని జాక్వెలిన్ న్యాయవాది కోరారు. ఈ అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం రూ.50వేల పూచికత్తుపై జాక్వెలిన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 22వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ తాజాగా విచారించిన కోర్టు జాక్వెలిన్‌కు మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.