తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Balagam Review: దర్శకుడిగా కమెడియన్​ వేణు.. తొలి ప్రయత్నంలో హిట్ కొట్టినట్టేనా?

ప్రియద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌ కీలక పాత్రల్లో నటించిన 'బలగం' సినిమా విడుదలైంది. ఈ చిత్రంతోనే కమెడియన్​ వేణు దర్శకుడిగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఆయన దర్శకుడిగా సక్సెస్​ అయినట్టేనా? ఆ సంగతులు..

Comedians Venu and Priyadarshan Balagam movie review
Balagam Review: దర్శకుడిగా కమెడియన్​ వేణు.. తొలి ప్రయత్నంలో హిట్ కొట్టినట్టేనా?

By

Published : Mar 3, 2023, 7:23 AM IST

Updated : Mar 3, 2023, 7:33 AM IST

ఇప్పటికే ఎంతో మంది న‌టులు ద‌ర్శ‌కులుగా మారారు. వారిలో హీరోలు డైరెక్టర్స్​గా మారి సత్తా నిరూపించుకోగా.. కమెడియన్స్​ దర్శకులుగా మారి హిట్​లను అందుకున్న సందర్భాలు తక్కువే. అయితే ఇప్పుడు హాస్య న‌టుడు వేణు టిల్లు ఈ జాబితాలోకి చేరారు. ఆయ‌న మెగాఫోన్ పట్టి.. ఏకంగా ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ప్రొడక్షన్ హౌస్​లో తన తొలి సినిమా చేశారు. దిల్‌రాజు ఫ్యామిలీకి చెందిన సెకండ్ జనరేషన్​ హ‌న్షిత‌, హ‌ర్షిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకి బజ్​ రావడానికి కారణం దిల్‌రాజు అనే చెప్పాలి. అయితే ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందామా..

ఇదే కథ.. తెలంగాణలోని ఓ మారుమూల ప‌ల్లెలో సాగే స్టోరీ ఇది. సాయిలు పాత్ర పోషించిన ప్రియ‌ద‌ర్శి ఓ నిరుద్యోగి. ఉపాధి కోస‌ం ఎన్నో ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ల‌క్ష‌ల్లో అప్పు చేసి ఊరిలో ఓ స్నూక‌ర్ బోర్డ్ పెడ‌తాడు. అది అత‌డిని క‌ష్టాల నుంచి ఏమాత్రం గ‌ట్టెక్కించ‌దు. పైగా అప్పుల ఒత్తిళ్లు మరింత ఎక్కువ అవుతాయి. కనీసం పెళ్లి చేసుకుంటే వ‌చ్చే క‌ట్నంతోనైనా అప్పులు తీర్చుకుందామని అతడు భావిస్తాడు. త‌న ముందున్న ఏకైక దారి అదే అనుకుంటాడు. ఎట్టకేలకు పెళ్లి సెట్​ చేసుకుంటాడు. అప్పుల వాళ్ల‌కి కూడా ఇదే విష‌యం చెప్పి నెట్టుకొస్తాడు. ఇదే సమయంలో నిశ్చితార్థం ప‌నులు జ‌రుగుతుంటే... సడెన్​గా అతడి తాత కొముర‌య్య కన్నుమూస్తాడు. దీంతో ఆ పెళ్లి ఆగిపోతుంది. ఇక సాయిలు క‌ష్టాలు మరింత రెట్టింపు అవుతాయి. అయితే తాత మ‌ర‌ణంతో.. సూర‌త్‌లో ఉన్న తన బాబాయ్‌, ఎప్పుడో 20ఏళ్ల కింద‌ట దూర‌మైన తన మేన‌త్త‌, మేన‌మామ.. వాళ్ల కూతురు సంధ్య (హీరోయిన్​ కావ్య క‌ళ్యాణ్‌రామ్‌) కూడా తన ఇంటికి వస్తారు. దీంతో ఒక‌ప‌క్క వాళ్ల మంచి చెడులు చూస్తూనే తాత అంత్యక్రియలు పూర్తి చేస్తాడు. కానీ ఆ త‌ర్వాతే అతడి అస‌లైన క‌ష్టాలు చుట్టుముడుతాయి. చిన్న క‌ర్మ రోజు పెట్టిన పిండం తినేందుకు కనీసం ఒక్క కాకి కూడా రాదు. అక్కడ వాలదు. దీంతో కొముర‌య్య కొడుకు-అల్లుడు మ‌ధ్య వివాదం ప్రారంభమవుతుంది. కనీసం ఐదో రోజైనా కాకులొస్తాయి అనుకుంటే ఆ రోజు కూడా మళ్లీ అదే రిపీట్​ అవుతుంది. అలా ఇంట్లో గొడ‌వ‌లు రోజురోజుకు పెరిగిపోతాయి. తాత మ‌న‌సులో ఏదో బాధ ఉండ‌టం వల్లే కాకులు రావ‌డం లేద‌ని.. అది ఊరికే అరిష్టమని పంచాయ‌తీలో పెద్ద‌లు అంటారు. మరి పెద్ద క‌ర్మ ప‌ద‌కొండో రోజు ఏం జ‌రిగింది? అప్పుడై కాకులు వచ్చి పిండాన్ని తిన్నాయా లేదా? కుటుంబ స‌భ్యుల మ‌ధ్య గొడ‌వ‌లు పోయాయా లేదా? మొత్తానికి సాయిలు క‌ష్టాలు తీరాయా లేదా? అన్నదే మిగ‌తా కథాంశం.

ఎవ‌రెలా చేశారంటే.. సినిమాలో ప్రత్యేకంగా హీరో హీరోయిన్లంటూ ఎవ్వ‌రూ క‌నిపించ‌రు. ప్ర‌తి పాత్రకి ఓ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో మొదట బ‌ల‌మే అది. ప్రియ‌ద‌ర్శి ఎప్పడి లాగే తన మార్క్​ కామెడీతో బాగా నవ్వించాడు. క్లైమాక్స్​లో తాత‌ని గుర్తు చేసుకునే సీన్​లో మంచి ఎమోషన్ పండించాడు. తాత కొముర‌య్య‌, కొడుకు ఐల‌య్య‌, త‌మ్ముడు, చెల్లెలు, బావ ఇలా అన్ని పాత్ర‌లు బాగా ఆక‌ట్టుకుంటాయి. ఆయా పాత్రలకు త‌గ్గ‌ట్టుగా కొత్త న‌టుల్ని ఎంచుకోవడం కూడా బాగుంది. వారు బాగా నటించారు. ఇక టెక్నికల్ విషయానికొస్తే.. మ్యూజిక్​, కెమెరా అన్ని విభాగాల్లోనూ వారి ప‌నితీరు కనపడింది. తెలంగాణ ప‌ల్లెటూరిని కెమెరా ఎంతో అందంగా చూపించారు. అసలు ఈ సినిమాకు ప్రారంభం నుంచి చివ‌రి సీన్​ వ‌ర‌కు పాట‌లే హైలైట్​. కాస‌ర్ల శ్యామ్ ర‌చించిన సాంగ్స్​ సంద‌ర్భోచితంగా వస్తూ క‌థ‌ను ముందుకు తీసుకెళ్లాయి. భీమ్స్ బాణీలు అదిరిపోయాయి. ద‌ర్శ‌కుడు వేణు ఓ మంచి క‌థను బాగా తెరకెక్కించాడనే చెప్పాలి. నిర్మాణం కూడా బాగుంది.

బ‌లాలు: క‌థా నేప‌థ్యం బాగుంది. కామెడీ, ఎమోషన్స్​ బాగా పండాయి. పాటలు బాగా ఆకట్టుకున్నాయి.

బ‌ల‌హీన‌త‌లు: కొన్ని స‌న్నివేశాలు సాగదీతగా ఉన్నాయి. ప్రేక్ష‌కుడి ఊహ‌కు అందేలా కథ నడిసింది.

మొత్తంగా చెప్పాలంటే.. విలువ‌లు, భావోద్వేగాలే ఈ సినిమాకు బ‌లం. అందుకే సినిమా 'బలగం'.

ఇదీ చూడండి:ముగ్గురు భామలతో వెంకటేశ్​.. అలా చేయడం ఎంతో సంతృప్తిగా ఉందటా!

Last Updated : Mar 3, 2023, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details