Raju Srivastava passes away : బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ(58) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. అయితే ఆగస్టు 10న గుండెనొప్పితో దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. 40 రోజులుగా ఆస్పత్రిలో ఉన్న ఆయన బుధవారం ఉదయం ఆరోగ్య పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారని ఆయన సోదరుడు దీపూ శ్రీవాస్తవ తెలిపారు.
రాజు శ్రీవాస్తవ 1980 నుంచి వినోదం రంగంలో ఉంటున్నారు. 2005లో జరిగిన 'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్'తో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అనతి కాలంలోనే స్టాండప్ కమెడియన్ నుంచి సినిమా రంగంలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా వచ్చారు. బాలీవుడ్ అగ్ర నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
స్టేజ్ నాటకంలో 'గడోధర్ భయ్యా' అనే పాత్రతో జనాదరణ పొందిన రాజు శ్రీవాస్తవ.. ఉత్తర్ప్రదేశ్ ఖాన్పుర్ జిల్లాలో 1963 డిసెంబర్ 25న జన్మించారు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి.. ఈ స్థాయికి ఎదిగారు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఆయన.. శిఖాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
'మైనే ప్యార్ కియా', 'బాజీగర్', 'బాంబే టూ గోవా', 'ఆమ్దాని అత్తాని ఖర్చా రూపియా' అనే సినిమాల్లో నటించారు. ఉత్తర్ప్రదేశ్ ఫిల్మ్ డెవెలప్మెంట్ కౌన్సిల్ ఛైర్పర్సన్గా కూడా రాజు శ్రీవాస్తవ వ్యవహరించారు. రాజు శ్రీవాస్తవ ఆగస్టు 10న గుండెపోటుకు గురయ్యారు. జిమ్‌లో వ్యాయవం చేస్తుండగా ఆయనకు అకస్మాతుగా ఛాతి నొప్పి వచ్చి కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
రాజు శ్రీవాస్తవ మరణ వార్త తెలిసిన ప్రముఖులు సంతాపం తెలిపారు. భారత హోం శాఖ మంత్రి అమిత్ షా.."ప్రఖ్యాత హాస్యనటుడు రాజు శ్రీవాస్తవకు ఒక విలక్షణమైన శైలి ఉంది, ఆయన తన అద్భుతమైన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆయన మరణం కళారంగానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. భగవంతుడు వారికి ఈ బాధను భరించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను." అని ట్వీట్ చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ట్విట్టర్ వేదికగా రాజు శ్రీవస్తవకు నివాళులర్పించి.. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఇవీ చదవండి:'గిరి గీసుకొని ఉంటానంటే ఎలా?.. ఈ 'అల్లూరి' వందలో ఒక్కడు'
'అవతార్' నిడివి కోసం పోట్లాట.. 'డాన్3'లో మరో హీరో ఎవరు?