'కథ విని... పాత్ర బాగుందనిపిస్తేనే సినిమా చేస్తున్నా' అని చెప్పారు హాస్య నటుడు అలీ. హాస్య నటులకి పెట్టింది పేరైన తెలుగు చిత్రసీమలో అలీది ఓ ప్రత్యేకమైన అధ్యాయం. 43 ఏళ్లుగా ఆయన నట ప్రయాణం కొనసాగుతోంది. వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా తెరకెక్కిన 'ఎఫ్3'లో ఓ కీలక పాత్ర పోషించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం అలీ హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
''కుటుంబ కథలు అరుదుగా తెరకెక్కుతున్నాయి. అందులోనూ పదుల సంఖ్యలో నటులతో సినిమాలు తీసే దర్శకులు తక్కువైపోయారు. అనిల్ రావిపూడి మాత్రం కె.రాఘవేంద్రరావు, ఈవీవీ సత్యనారాయణ, దాసరి నారాయణరావుల్ని గుర్తు చేస్తున్నారు. 'ఎఫ్3' సినిమా పతాక సన్నివేశాలు తెరకెక్కించే సమయంలో సెట్లో 30కిపైగా కార్‌వ్యాన్లు కనిపించాయి. ఒకప్పటిలా సందడి వాతావరణం కనిపించింది. అంత మంది నటులున్నా... ఏమాత్రం బెరుకు లేకుండా చిత్రీకరణ చేస్తుంటాడు అనిల్. ఇందులో ఒకరిని మించి ఒకరు నటించారు. మళ్లీ మళ్లీ థియేటర్‌కి వస్తారు ప్రేక్షకులు. అంతగా పాత్రలు వినోదం పంచుతాయి''.
''ఇందులో పాల బేబీ అనే పాత్రని నేను పోషించా. డబ్బుని వడ్డీకి తిప్పుతుంటాడు పాల బేబీ. ఆడవాళ్లంటే అపారమైన గౌరవం. సినిమా మొత్తం 45 నిమిషాలపాటు నా పాత్ర కనిపిస్తుంది. పాల బేబీ గన్ ఎందుకు పట్టుకున్నాడనేది తెరపైనే చూడాలి. ఆ గన్ మోయలేకపోయా. చిత్రీకరణ పూర్తయ్యాక కొన్ని రోజుల వరకూ చేతుల్లో నొప్పి తగ్గలేదు. అంత బరువైన పాత్ర చేశానన్నమాట (నవ్వుతూ)''.