ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆయనపై చెంపదెబ్బ ఎఫెక్ట్ పడింది. దాంతో వచ్చే ఏడాది ఆస్కార్ వేడుకల్లో వ్యాఖ్యాతగా అలరించేందుకు ఆయన నిరాకరించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇంగ్లీష్ వెబ్‌సైట్స్‌లో కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో యావత్ ప్రపంచం ఆస్కార్ అవార్డు వేడుకను ఆసక్తిగా తిలకిస్తోన్న సమయంలో వేదికపై క్రిస్‌రాక్ చెంప దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. తన సతీమణి అనారోగ్యంపై జోకులు వేయడం తట్టుకోలేకపోయిన అగ్ర నటుడు విల్ స్మిత్.. క్రిస్ చెంప పగలగొట్టాడు.
తాజాగా ఆయన మరోసారి ఆస్కార్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించాలంటూ ఆఫర్ వచ్చింది. దీనిపై అరిజోనాలోని ఓ కామెడీ సెట్‌లో మాట్లాడుతూ.. ఇంకోసారి ఆస్కార్ వేడుకలకు వెళ్లడాన్ని నేరం జరిగిన ప్రాంతానికి తిరిగి వెళ్లడంగా పోల్చుతూ క్రిస్ స్పందించారని అరిజోనా రిపబ్లిక్ వెల్లడించింది. అలాగే స్మిత్ గురించి మాట్లాడుతూ.."ఆయన నా కంటే పెద్దవాడు. ఆ ప్రాంతం మరోసారి మా మధ్య ఈ తరహా పోరాటానికి అనుమతించదు" అని వ్యాఖ్యానించారు. ఈ ఘటన తర్వాత క్రిస్.. ఒక సూపర్ బౌల్ యాడ్‌ను కూడా తిరస్కరించారు.