యువ హీరో ఆకాశ్‌పూరి నటించిన తాజా చిత్రం 'చోర్ బజార్'. జీవన్‌రెడ్డి దర్శకుడు. ఈ సినిమా ఈనెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపారు హీరో ఆకాష్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
"నేనిప్పటివరకు చేసిన చిత్రాల్లో పూర్తి భిన్నమైన సినిమా ఇదే. పూర్తి కమర్షియల్ అంశాలతో హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ సాగుతుంది. నేనిందులో బచ్చన్ సాబ్ అనే పాత్రలో కనిపిస్తా. పాత్ర తీరు చాలా కొత్తగా ఉంటుంది. అందుకే కథ వినగానే చేస్తానని చెప్పా. చోర్ బజార్ ఏరియా అనగానే మనం అక్కడి వాళ్లు దొంగతనాలు చేస్తుంటారనుకుంటాం. కానీ, దగ్గరగా చూస్తే వాళ్ల జీవితాలు వేరుగా ఉంటాయి. అక్కడి మనుషులు, కుటుంబాలు, వాళ్ల కష్టాలు ఇవన్నీ ఈ సినిమాలో చూస్తారు"
"ఈ సినిమాలో నేనొక టైర్ల దొంగగా కనిపిస్తా. కారు కనిపించిందంటే చాలు నిమిషాల్లో టైర్లు మాయం చేసేస్తుంటా. ఈ చోరకళలో రికార్డులూ సాధించేస్తుంటా. అయితే ఆ డబ్బులతో చోర్ బజార్‌లోని పేదవారికి సాయం చేస్తుంటాను. అందుకే అక్కడి వాళ్లకు నేను హీరో. దర్శకుడు జీవన్ తన చిత్రాల్లో హీరోయిజాన్ని బాగా చూపించారు. ఈ చిత్రంతో నాకు ఓ కొత్త ఇమేజ్ వస్తుందని ఆశిస్తున్నా. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా స్టైలిష్‌గా ఉంటాయి. క్లైమాక్స్ అదిరిపోతుంది. ఈ చిత్రంలో వజ్రం ఒక క్యారెక్టర్‌గా కనిపిస్తుంది. దాని చుట్టూ జరిగే డ్రామా థ్రిల్ పంచుతుంది"