తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అందుకే 'సీతారామం'లో సీత పాత్రకు తెలుగు అమ్మాయిని తీసుకోలేదు: హను రాఘవపూడి - ఈటీవీ చెప్పాలని ఉంది కార్యక్రమం

హను రాఘవపూడి.. మొదటి సినిమా 'అందాల రాక్షసి'తోనే తన అభిరుచి చాటుకున్నాడు. 'కృష్ణగాడి వీరప్రేమగాథ'తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా 'సీతారామం'తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'చెప్పాలని ఉంది' కార్యక్రమానికి వచ్చిన పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. అవి ఆయన మాటల్లోనే..

chitchat-with-sita-ramam-director-hanu-raghavapudi
chitchat-with-sita-ramam-director-hanu-raghavapudi

By

Published : Dec 19, 2022, 9:51 AM IST

Seetaramam Director Hanu Raghavapudi: తొలి సినిమా 'అందాలరాక్షసి'తోనే తన అభిరుచిని చాటుకున్న దర్శకుడు హను రాఘవపూడి. కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా 'సీతారామం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీసుకు భారీ హిట్‌ అందించారు. తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు హను రాఘవపూడి చెప్పాలని ఉంది కార్యక్రమానికి వచ్చి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

మీ పూర్తిపేరు ఏంటి? సినిమా రంగంవైపు రావాలని ఎలా అనిపించింది?
హను రాఘవపూడి: నేను పుట్టి పెరిగింది అంతా ఖమ్మంలోనే. నా పూర్తి పేరు హనుమంతరావు రాఘవపూడి. ఇంట్లో అందరూ హను అని పిలుస్తారు. నేను 2005లో ఓ షార్ట్‌ఫిల్మ్‌ తీశాను. ఆ టైటిల్స్‌లో పూర్తిపేరు ఉంటుంది. ఆ తర్వాత అందాలరాక్షసి సినిమా అప్పుడు హనుగా మార్చుకున్నా. నేను చిరంజీవి గారికి వీరాభిమానిని. ఇంట్లో తెలియకుండా సినిమాలకు వెళ్లేవాడిని. చిన్నప్పటి నుంచి కథలు రాసే అలవాటు ఉంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉద్యోగం అంటే అసలు నచ్చదు. 'ఉపేంద్ర' సినిమా చూశాక సినిమా రంగం వైపు రావాలని అనుకున్నా.

మొదటిసారి అవకాశం ఎలా వచ్చింది?
హను రాఘవపూడి:చదువుకోడానికి 2000 సంవత్సరంలో హైదరాబాద్‌ వచ్చాను. ఇక్కడకు వచ్చాక జూబ్లీహిల్స్‌లో సినిమా వాళ్లు ఉంటారని తెలిసింది. ఒకరోజు బండిమీద జూబ్లీహిల్స్‌ వెళ్లా. అక్కడ అమృతం సీరియల్‌ షూటింగ్‌ జరుగుతోంది. అప్పుడు దర్శకుడు చందుని కలిసి 'నేను డైరెక్షన్‌ వైపు రావాలనుకుంటున్నా' అని అడిగా. ఆయన స్కూల్‌ల్లో, కాలేజీలో నాకు వచ్చిన మార్కులు చూసి.. 'ఎందుకు ఇటువైపు రావడం. ఇంత బాగా చదువుతున్నావు. హాయిగా ఉద్యోగం చేసుకో' అన్నారు. మూడు రోజులు వరసగా వెళ్లాను. నా ఆసక్తిచూసి అవకాశం ఇచ్చారు. 'ఐతే' సినిమాకు పనిచేశాను. చదువు మానేసి సినిమా వైపు వెళ్లానని ఇంట్లో వాళ్లు 6 నెలలు మాట్లాడలేదు.

అందాలరాక్షసి సినిమా గురించి చెప్పండి?
హను రాఘవపూడి:నేను సినిమారంగంలోకి రావడానికి కష్టపడలేదు. మొదటి సినిమా అవకాశం రావడానికి కూడా కష్టపడలేదు. నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు అందాలరాక్షసి కథ రాసుకున్నా. ఆ కథ నా స్నేహితుడికి చెప్పా. వెంటనే ‘తీద్దాం’ అన్నాడు. ఈ సినిమాకు నటీనటుల దగ్గరి నుంచి పనిచేసిన వాళ్ల వరకు అందరూ కొత్తవాళ్లే. మధ్యలో అనుకోకుండా సాయి కొర్రపాటిగారు జాయిన్‌ అయ్యారు. ఈ సినిమా తర్వాత మూడు సంవత్సరాలు విరామం తీసుకున్నా. ఆ మూడేళ్లల్లో జీవితం అంటే ఏంటో తెలిసింది. మనుషుల నుంచి చాలా నేర్చుకున్నా. నిజానిజాలు తెలుసుకున్నా.

కృష్ణగాడి వీరప్రేమగాథ ఒక రొమాంటిక్‌ కామెడీ థ్రిల్లర్‌ సినిమా.. ఇలాంటి కథ తీయాలని ఎందుకు అనిపించింది?
హను రాఘవపూడి:లవ్‌స్టోరీలు నాకు పెద్దగా నచ్చవు. చూడడానికి ఇష్టపడతానంతే. నాకు వ్యక్తిగతంగా యాక్షన్‌, క్రైమ్‌ కథలు ఇష్టం. కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అన్ని అంశాలు ఉంటాయి. ఒక రచయిత తన కథను తానే తెరకెక్కించడం చాలా కష్టమైన విషయం. కానీ అలా తీస్తేనే అనుకున్నది అనుకున్నట్లు వస్తుందని నా అభిప్రాయం.

'లై' సినిమా ఎందుకు అలరించలేకపోయింది?
హను రాఘవపూడి:దానికి చాలా కారణాలు ఉంటాయి. నేను బాగా రాయకపోవచ్చు, డైరెక్షన్‌ సరిగా చేయకపోవచ్చు. ఒక సినిమా హిట్‌ కాలేదంటే అందులో హీరోల తప్పు అసలు ఉండదు. నటీనటులు సరిగా నటించలేదంటే అది దర్శకుడి తప్పు అని నేను నమ్ముతాను. నేను బాగా ట్రావెల్‌ చేస్తుంటా. అలా తిరుగుతున్నప్పుడు నేను కలిసిన మనుషులను గమనిస్తా. అలా గమనించిన విషయాలు కథ రాసేటప్పుడు ఉపయోగపడతాయి.

సినిమాల విడుదలకు ఎందుకు విరామం ఎక్కువ తీసుకుంటారు?
హను రాఘవపూడి:కథ రాయడానికి ఎక్కువ సమయం తీసుకుంటా. అందుకే సినిమా విడుదలకు చాలా ఆలస్యమవుతుంది. నాకు చలం గారు రాసిన 'మైదానం' పుస్తకం చాలా ఇష్టం. ఆయన రచనా శైలి బాగుంటుంది. సినిమా విషయంలో నాకు ఏదైనా సందేహాలు వస్తే విశ్వనాథ్‌, మణిరత్నంల సినిమాలు చూస్తా. విశ్వనాథ్‌ గారు తీసిన సప్తపది సినిమా ఒక సాహసం.

'సీతారామం' సినిమా గురించి చెప్పండి?
హను రాఘవపూడి:నాకు పుస్తకాలు కొనడం అలవాటు. అలా నేను కోఠిలో కొన్న ఓ సెకండ్‌ హ్యాండ్‌ పుస్తకంలో లెటర్ ఉంది. అది ఓపెన్‌ కూడా చేయలేదు. హాస్టల్‌లో ఉంటున్న అబ్బాయికి వాళ్ల అమ్మ రాసిన లెటర్‌ అది. విషయం ఏమీ లేదు. సెలవులకు ఇంటికి రమ్మని రాశారు. కానీ అది చదివాక నాకు ఆలోచన వచ్చింది. ఒకవేళ ఆ లెటర్‌లో ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే..? అని అనుకున్నా. ఆ ఆలోచనే 'సీతారామం' సినిమా రావడానికి మూలకారణం. కథ రాసుకున్న తర్వాత స్వప్న గారికి చెప్పా. ఈ కథకు దుల్కర్‌ కచ్చితంగా సరిపోతాడని అనిపించింది. అందుకే తనని సెలెక్ట్‌ చేశాం. కమ్యూనికేషన్‌ అనేది ప్రేమకథకు మూలం. దేవదాస్‌-పార్వతి దగ్గరి నుంచి మరోచరిత్ర వరకూ ఏ సినిమాలో అయినా కమ్యూనికేషనే ముఖ్యం.

సీతారామంలో సుమంత్‌గారి క్యారెక్టర్‌ కోసం ఎవరిని అనుకున్నారు? సీత పాత్రకోసం తెలుగు అమ్మాయి దొరకలేదా?
హను రాఘవపూడి:ఆ పాత్రకు సుమంత్‌గారు అయితే బాగుంటుందని స్వప్నకు చెప్పా. ఆమె మాట్లాడింది. సుమంత్‌ సినిమాకు ఓకే చెప్పే ముందు కథ చదవాలని అన్నాడు. చదివి వెంటనే ఫోన్‌ చేసి చాలా బాగుంది అని ఓకే చెప్పారు. సీత పాత్ర కోసం మృణాల్‌ను ఎంపిక చేశాం. కొత్తగా ఉండాలని అనుకుంటుంటే స్వప్న.. మృణాల్‌ గురించి చెప్పింది. చూడగానే సీతపాత్రకు సరిపోతుందని అనిపించింది. ఇక తెలుగు అమ్మాయిని ఎందుకు తీసుకోలేదంటే.. తెలుగు వాళ్ల ప్రొఫైల్స్‌ ఎక్కడా కనిపించవు. ఫలానా అమ్మాయి ఉందని తెలిస్తే తను పాత్రకు సరిపోతుందా లేదా అని చూడొచ్చు. అలా ఎక్కడా తెలుగు అమ్మాయిల ప్రొఫైల్స్‌ కనిపించవు. తెలుగు వాళ్లు దొరికితే ఇంకా మాకే హాయి.. ఎందుకంటే వాళ్లకు భాష వచ్చి ఉంటుంది.

సీతారామం సినిమాకు సంగీతం ప్రాణం పోసింది? మ్యూజిక్‌ గురించి చెప్పండి?
హను రాఘవపూడి:విశాల్‌ నాకు మొదటి నుంచి తెలుసు. సాహిత్యం బాగుంటే పాట హిట్‌ అవుతుందని నేను నమ్ముతాను. నేను మ్యూజిక్‌కు సంబంధించి ఎలాంటి సలహాలు ఇవ్వను. నాకు దాని గురించి ఏమీ తెలీదు.

మీరు రూ.100కోట్ల క్లబ్‌లో చేరారు. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది?
హను రాఘవపూడి:ఏదీ శాశ్వతం కాదు. ఈ రోజు హిట్‌ ఎప్పటికీ ఉండదు. నిన్న ఫ్లాప్‌ కంటిన్యూ అవ్వదు. అందాలరాక్షసి సినిమా తర్వాత నేను చాలా నేర్చుకున్నా అని చెప్పా కదా ఇలాంటివే అవి. నేను ఈరోజు హిట్‌ వచ్చిందని పొంగిపోను. నిన్న రాలేదని కుంగిపోలేదు. సినిమాకోసం మనం ఎంత కష్టపడ్డామో మనకు తెలుసు. సినిమా బాగుందని 100 మంది చెప్పాల్సిన అవసరం లేదు. మనం అనుకున్నది 10 మందికి చేరినా చాలు. సీతారామం యూనివర్సల్‌ స్టోరీ. అది ఏ భాషలో తీసినా హిట్‌ అవుతుంది. ఆ సినిమాలో ఎమోషన్స్‌ అలా ఉంటాయి.

దేశభక్తి, ప్రేమ రెండింటినీ కలిపి యుద్ధంతో రాసిన ప్రేమకథ అని ఎందుకు పెట్టాలనిపించింది?
హను రాఘవపూడి:ఈ సినిమాలో ప్రతి పాత్ర తనలో తాను యుద్ధం చేసుకుంటుంది. అందుకే యుద్ధంతో రాసిన ప్రేమకథ అని పెట్టాం. ఇక అఫ్రిన్‌ పాత్రలో రష్మిక కాకుండా మరొకరు కనిపించలేదు. క్యారెక్టర్‌ అనుకోగానే రష్మిక అయితే బాగుంటుందనుకున్నాం. తను అద్భుతంగా చేసింది.

ఓటీటీల్లో సినిమాలు చూసేవాళ్లు కూడా సీతారామం సినిమా కోసం థియేటర్లకు వచ్చారు. ఎలా అనిపించింది మీకు?
హను రాఘవపూడి:ఈ కథ అందరికీ నచ్చుతుందని నేను నమ్మాను. ఎక్కువగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య వాళ్లకు బాగా నచ్చుతుందనుకున్నా. వాళ్లు చాలా కనెక్ట్‌ అయ్యారు. థియేటర్లకు రాలేని పెద్దవాళ్లు ఓటీటీలో ఈ సినిమా చూశారు. వాళ్లు నన్ను ఎంత మెచ్చుకున్నారో. చాలా సంతోషం వేసింది. ఒక పెద్దావిడ ఈ సినిమా చూసి తెగ ఏడ్చేసింది.

బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయట నిజమేనా?భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు తీస్తారు?
హను రాఘవపూడి:అవునండీ, అవకాశాలు వచ్చాయి. కానీ నేను ప్రస్తుతానికి తెలుగు సినిమాలే తీయాలనుకుంటున్నా. భవిష్యత్తులో రానున్న సినిమాలు 'సీతారామం'ను మించి ఉంటాయి.

ఇండస్ట్రీలో మిమ్మల్ని నమ్మకూడదు.. అని ప్రచారం జరిగిందట అది నిజమేనా?
హను రాఘవపూడి:ఈ మాట సీతారామం సక్సెస్‌ మీట్‌లో నేనే చెప్పాను. నేను కథ బాగా చెప్తాను. కానీ బాగా తీయను అని టాక్‌ నడిచింది. అలాంటి ప్రచారం ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. నమ్మొద్దు అంటే.. ఏ విషయంలో నమ్మకూడదు. కథ బాగా రాయలేనా.. దర్శకత్వం బాగా చేయలేనా.. నాకు ఇప్పటికీ తెలీదు ఇలా ఎందుకు అన్నారో. ప్రచారం చేసిన వాళ్లు ఎవరో కూడా నాకు తెలుసు. ఈసారి వాళ్లని కలిసినప్పుడు ఎందుకు ఇలా చెప్పారో కచ్చితంగా అడుగుతాను.

సీతారామం సినిమాటోగ్రఫీ గురించి ఏం చెబుతారు? మంచి దర్శకుడు అవ్వాలంటే ఎలాంటి గుణాలు ఉండాలి?
హను రాఘవపూడి:ఈ సినిమాకు కథ, కథనం ఒకవైపు ఉంటే.. సినిమాటోగ్రఫీ మరోవైపు ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది. పీఎస్ వినోద్, శ్రేయాస్‌ కృష్ణన్‌ ఇద్దరూ చాలా బాగా పనిచేశారు. వినోద్‌గారితో పనిచేయడం వల్ల నేను ఎదిగాను. చాలా విషయాలు నేర్చుకున్నా. దర్శకత్వం అనేది అందరిలో ఉంటుందని నేను భావిస్తా. మనందరం చిన్నప్పటి నుంచి మన ఇంట్లో వాళ్లు కథలు చెబితే విని ఒక ప్రపంచాన్ని ఊహించుకుంటాం. మనం ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకొని సినిమా తీయాలి. అలా తెలుసుకోకుండా సినిమా తీస్తే తెరపై చూసేటప్పుడు ప్రేక్షకులకు అర్థమవుతుంది. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. మన సంప్రదాయాలు తెలియాలి. లేకపోతే కష్టం.

మీకు బాగా ఇష్టమైన దర్శకులు ఎవరు?మీ కుటుంబం గురించి చెప్పండి?
హను రాఘవపూడి:కచ్చితంగా విశ్వనాథ్‌గారు, మణిరత్నం గారు. వీళ్లిద్దరి ప్రభావం నాపై చాలా ఉంది. బాపుగారు, రాజమౌళి, సుకుమార్‌లు ఇష్టం. అలాగే వెట్రిమారన్‌ గారి స్టైల్‌ బాగుంటుంది. అవకాశం వస్తే ఆయన చేసిన ‘అసురన్‌’ సినిమా రీమేక్‌ చేస్తా. ప్రస్తుతం మైత్రీ మూవీస్‌తో ఒక ప్రాజెక్ట్‌ చేస్తున్నా. కథ సిద్ధం అవుతుంది. అది అయ్యాక పూర్తి వివరాలు చెబుతాను. నానితో ఒక సినిమా అనుకున్నా. నా భార్య పేరు అమూల్య. ఆమె డెంటిస్ట్‌. నాకు ఇద్దరు పిల్లలు. ఒకబాబు, పాప.

ABOUT THE AUTHOR

...view details