చిరు రాజకీయాలను వీడి చాలా కాలమైనా ఇంకా ఆయన రాజకీయ ప్రసంగాలు అభిమానుల చెవుల్లో మారుమోగుతున్నాయి. దానికి కారణం చిరు అప్‌కమింగ్ మూవీ 'గాడ్‌ఫాదర్'. ఈ సినిమా బుధవారం రిలీజ్ కానున్న సందర్భంగా చిరు చెప్పిన కొన్ని ముచ్చట్లు మీ కోసం..
తెలుగు కథలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. ఈ దశలో మీరు మలయాళం సినిమాని రీమేక్ చేయడానికి కారణమేమిటి?
రీమేక్ అనేసరికి తక్కువ భావంతో ఎందుకు చూస్తారు? ఒరిజినల్ కంటే రీమేక్ చేయడమే అతి పెద్ద సవాల్. నటుల్ని, సినిమాల్నీ పోల్చి చూస్తారు. ఆ క్రమంలో మనం నిలబడతామా లేదా అనేది పెద్ద సవాల్. అయితే నేను చేసిన రీమేక్‌లను గమనిస్తే ఒరిజినల్ కన్నా ఎక్కువ వసూళ్లు సాధించాయి. పాత్రల పరంగానూ పేరొచ్చింది. పోల్చి చూసినా నిలబడగలనని నా చరిత్రే చెబుతుంది.
'గాడ్‌ఫాదర్' చేస్తున్నప్పుడు మీకు ఎదురైన సవాళ్లు ఎలాంటివి?
ప్రతీ కథకి ఓ ఆత్మ ఉంటుంది. దానితో మనం అనుసంధానం కావాలి. డ్యాన్సులు, ఫైట్లు, కామెడీకి కనెక్ట్ అవ్వకూడదు. ఆత్మని నిశితంగా గమనిస్తే సినిమా భవిష్యత్తుని దాదాపుగా చెప్పేయొచ్చు. మొదట 'లూసిఫర్' చూసినప్పుడు కొన్ని సందేహాలు వచ్చాయి. చరణ్ చెప్పాక మరోసారి ఆ సినిమా చూశా. అయినా తృప్తి కలగలేదు. దర్శకుడు మోహన్‌రాజా వచ్చి ఈ కథలో మార్పు చేశాక తృప్తి కలిగింది. ఒక కథ ఆత్మతో కనెక్ట్ అయ్యాక దాన్నొక కొత్త సినిమాలాగే చూస్తాను. మాతృకని పూర్తిగా మరిచిపోతాను. ఈ పాత్రని అవతలివాళ్లు ఎలా చేశారని పట్టించుకోను. దర్శకుల సహకారంతో నా నటన, హావభావాలు కొత్తగా ఉండేలా చూసుకుంటుంటా. రాజకీయాలు, కుటుంబం... రెండింటి మేళవింపుగా సాగే సినిమా ఇది. అదే అంశమే ఈ సినిమా చేయడానికి నన్ను ప్రేరేపించింది. ఇంకా ఇందులో ఏమేం ఉన్నాయో సినిమా చూస్తే అర్థమవుతుంది.
భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. పరిశ్రమల్లోని నటులు కలిసి నటిస్తున్నారు. మీతో కలిసి సల్మాన్‌ఖాన్ నటించారు. దీనిపై మీ అభిప్రాయమేంటి?
ముంబయి వేడుకలో సల్మాన్‌ఖాన్‌ని ఇదే ప్రశ్న అడిగారు. వాళ్లు దక్షిణాది నుంచి ఇక్కడికొస్తున్నారు, నేను అక్కడికి వెళ్లొద్దా? అన్నారు. ఆ చమత్కారం వెనక ఓ సత్యం ఉంది. భాషల మధ్య హద్దులు చెరిగిపోయినందుకు, మనదంతా భారతీయ సినిమాగా రూపాంతరం చెందినందుకు గర్వించాలి. కథ రీత్యా 'గాడ్‌ఫాదర్'లో నాకొక దళపతిలాంటి పాత్ర ఉంటుంది. ఆ పాత్ర చేయాలంటే ఆ నటుడికి ఓ స్థాయి ఉండాలి. అలాంటి పెద్ద నటుడు ఎవరున్నారా? అని ఆలోచించినప్పుడు నా కుటుంబానికీ, నాకూ సన్నిహితుడైన సల్మాన్‌ఖాన్ గుర్తొచ్చారు. అది కూడా ఉత్తరాదికి చెందినవారైతే బాగుంటుందని భావించి తనని సంప్రదించాం. వెంటనే ఒప్పుకున్నారు.