Chiranjeevi Vs Balakrishna: మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. ఈ రెండు పేర్లకు ఉండే అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవతరం కథానాయకులు వస్తున్నా వారికి పోటీగా నిలుస్తూ ఇంకా టాలీవుడ్‌ను ఏలుతున్నారు. వీరిద్దరి సినిమా రిలీజ్ అవుతుంటే అభిమానులు చేసే హడావిడి మాములుగా ఉండదు. ఇప్పటికే వీరిద్దరూ చాలా చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన 'ఖైదీ నెంబర్ 150', బాలయ్య నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాలు కూడా ఒకరోజు వ్యవధిలో రిలీజ్ అయి పోటీ పడ్డాయి. అయితే ఈ ఇద్దరు స్టార్స్ మరోసారి పోటీ పడటానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది.
బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా 'మెగా154'. 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంది. మాస్ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈసినిమాలో చిరుకు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తున్నారు. ఇందులో చిరు ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవలే మూవీటీమ్ తెలిపింది.