తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వెంకటేశ్​ అందం చూసి అసూయపడ్డా!- కానీ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్: చిరు

Chiranjeevi Venkatesh Relation : తొలిసారి హీరో వెంకటేశ్​ను చూశాక తన గుండెలో గుబులు మొదలైందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. తామిద్దరం మంచి మిత్రులుగా ఒకరి మంచిని మరొకరు కోరుకుంటూ ప్రయాణం చేస్తున్నామని చెప్పారు. వెంకీతో సినిమా చేయడం అత్యంత ఆనందకర విషయం అవుతుందని వెల్లడించారు.

Chiranjeevi Venkatesh Relation
Chiranjeevi Venkatesh Relation

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 7:57 AM IST

Updated : Dec 28, 2023, 8:05 AM IST

Chiranjeevi Venkatesh Relation :టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్​తో తనకు 40ఏళ్ల అనుబంధం ఉందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. కథలో ఎంపికలో ఒక సినిమాకు మరో సినిమాకు పొంతన లేకుండా వెంకీ సినీ ప్రయాణం చేస్తున్నారని ప్రశంసించారు. తన సినిమాల్లో మల్లీశ్వరి బాగా ఇష్టమని చెప్పారు.

"1983లో సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో సంఘర్షణ అనే సినిమా చేశా. అప్పుడు నిర్మాణ రంగంలో శిక్షణ పొందుతున్న సురేశ్‌బాబు పరిచయమయ్యారు. రామానాయుడికి రెండో అబ్బాయి కూడా ఉన్నాడని అప్పుడే తెలిసింది. ఎలా ఉంటాడు అని అడిగితే ఫర్వాలేదు అని చెప్పారు. కానీ కొన్నాళ్ల తర్వాత అందంగా మెరిసిపోతున్న వెంకటేశ్‌ను చూశాను. అప్పుడు నాలో గుబులు మొదలైంది. రామానాయుడు సంస్థలో సినిమా చేయడం నాలాంటి వాళ్లకి అప్పట్లో ఓ భరోసా, ధీమా. వాళ్ల అబ్బాయి హీరో అయితే నాకు గట్టిపోటీ ఎదురవుతుందని భయపడ్డా. కానీ తనకు సినిమాలపై ఆసక్తి లేదు రాజా అని రామానాయుడు చెప్పాక నేను ఊపిరి పీల్చుకున్నా. మళ్లీ రెండేళ్లకు వెంకటేశ్‌ తిరిగొచ్చాడు. కథానాయకుడిగా పరిచయమయ్యాడు. అప్పటి నుంచి మంచి మిత్రులుగా ఒకరి మంచిని మరొకరు కోరుకుంటూ ప్రయాణం చేస్తున్నాం" అని చిరంజీవి తెలిపారు.

"కథలో ఎంపికలో ఒక సినిమాకు మరో సినిమాకు పొంతన లేకుండా ప్రయాణం చేస్తున్నాడు వెంకీ. తన మల్లీశ్వరి నాకు ఇష్టమైన చిత్రం. కుటుంబం, యాక్షన్‌, ప్రేమ కథలు ఇలా అన్ని రకాల సినిమాలు చేశాడు. ఈ ప్రయాణం అప్రతిహతంగా సాగాలని కోరుకుంటున్నా. మేం కలిసి సినిమా చేయాలనేది తన కోరికా నా కోరిక కూడా. మంచి కథ కుదిరితే నా సోదరుడు వెంకీతో సినిమా చేయడం అత్యంత ఆనందకర విషయం అవుతుంది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. కెరీర్‌నే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని కూడా అందంగా నిర్మించుకున్నాడు. సురేశ్‌బాబు లాంటి అన్నయ్య ఉండటంతోనే అది సాధ్యమైందని భావిస్తుంటా. సంపూర్ణ వ్యక్తిత్వానికి నిర్వచనం వెంకటేశ్‌. కొన్ని వేడుకలు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. అలాంటి వేడుకే ఇది" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

హైదరాబాద్‍లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వెంకీ 75 కలియుగ పాండవులు- సైంధవ్‌ పేరిట జరిగిన కార్యక్రమంలో చిరంజీవి సహా సినీ ప్రముఖులు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్‌ రావిపూడి, బాబీ, శైలేశ్‌ కొలను, శ్రీవిష్ణు, అలీ, నిఖిల్‌, విశ్వక్‌సేన్‌, అడివిశేష్‌, విజయ్‌భాస్కర్‌.కె, ముప్పలనేని శివ, భీమనేని శ్రీనివాసరావు, బెల్లంకొండ సురేశ్‌, టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, వివేక్‌ కూచిభొట్ల, వెంకట్‌ బోయనపల్లి, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, ఆండ్రియా తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యగమనిక- ఈ కార్యక్రమం ప్రముఖ ఓటీటీ వేదిక 'ఈటీవీ విన్‌'లో ఈ నెల 31న ప్రసారం కానుంది.

Last Updated : Dec 28, 2023, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details