Chiranjeevi Trisha : చిత్రసీమలో ఓ సినిమాను పట్టాలెక్కించేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో దర్శకులు, నిర్మాతలు, నటీనటుల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తుంటాయని మనం వింటూనే ఉంటాం. అలా వారు ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తుంటాయి. కానీ కొంతకాలం తర్వాత మరో సినిమా కోసం వారు కలుస్తుంటారు. అలా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి- గ్లామర్ క్వీన్ త్రిష కలిసి తమ కొత్త సినిమా కోసం కలిసి పనిచేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా చిరు నటించనున్న కొత్త సినిమాలో హీరోయిన్గా నటించడానికి ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే'భోళాశంకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అదే సమయంలో తన కొత్త సినిమాకి సంబంధించిన పనుల్లోనూ బిజీగా ఉంటున్నారు. అయితే ఈ చిత్రంలో నటీనటుల ఎంపికపై కొన్నాళ్లుగా కసరత్తులు జరగుతున్న సంగతి తెలిసిందే. దీనికి బంగార్రాజు ఫేమ్ కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించనున్నారట. తండ్రీ కొడుకుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని తెలిసింది. ఈ సినిమాలోనే చిరంజీవి భార్యగా త్రిషగా కనిపించనుందని తెలిసింది. త్వరలోనే అధికార ప్రకటన రానుందట. ఇకపోతే ఈ చిత్రంలో యంగ్ హీరో డీజె టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నారట. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన 'బ్రో డాడీ'కి రీమేక్‌గా ఈ మూవీ రూపొందనుందట. చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
17ఏళ్ల తర్వాత.. చిరంజీవి-త్రిష కలిసి గతంలో 'స్టాలిన్' సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా వచ్చి దాదాపు 17ఏళ్లు అయింది. ఆ తర్వాత 'ఆచార్య' కోసం వీరిద్దరు కలిసి నటించనున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా త్రిష సినిమా నుంచి తప్పుకున్నట్లు అన్నారు. ఇప్పుడు తాజా వార్త నిజమైతే.. ఈ జంట మళ్లీ 17ఏళ్ల తర్వాత కలిసి నటించినట్టవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..