చిత్ర పరిశ్రమలో ఓ హీరో చేయాల్సిన సినిమా.. అనివార్య కారణాల వల్ల మరొక హీరో చేయడం సర్వసాధారణం. అలానే, తమ వద్దకు వచ్చిన కథలను కొందరు నటులు మరొకరు చేస్తే బాగుంటుందని దర్శక-నిర్మాతలకు సూచిస్తుంటారు. అలా అప్పట్లో ఓ చిత్రం కోసం చిరంజీవి.. తన సహ నటుడు, స్నేహితుడు అయిన రాజశేఖర్‌ను రెకమెండ్ చేశారు. అదే రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన 'న్యాయం కోసం'.
మలయాళంలో ఘన విజయం సాధించిన 'ఒరు సీబీఐ డైరీ కురిప్పు' అనే మలయాళ చిత్రం ఆధారంగా దీన్ని రూపొందించారు. ఇందులో సీబీఐ ఆఫీసర్ పాత్ర చేయాల్సిన చిరంజీవి స్వయంగా ఆ పాత్రకు రాజశేఖర్‌ను రికమెండ్ చేశారు. 'ఒరు సీబీఐ డైరీ కురిప్పు' చిత్రం అప్పట్లో మద్రాసులో విడుదలై సంచలనం సృష్టించింది. ఆ చిత్రం గురించి నటుడు రాజశేఖర్ విని తన నిర్మాతలలో ఎవరితోనైనా ఆ చిత్రం హక్కులు కొనిపించి ఆ సినిమాలో నటించాలనుకున్నారు. అయితే, అప్పటికే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆ హక్కుల్ని కొనేశారని రాజశేఖర్‌కు తెలిసింది. దాంతో చిరంజీవితోనే ఆ సినిమా తీస్తారని ఊహించి రాజశేఖర్ నిరాశ చెందారు. తర్వాత ఆ సినిమా చూసి, చిరంజీవి లక్కీ పర్సన్, అని మనసులోనే అనుకుని, ఆ విషయాన్ని మర్చిపోయారు.