భారీ అంచనాలతో విడులైన 'ఆచార్య' ఆడకపోవడంపై మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. ఆ సినిమా అపజయం తనను ఏమాత్రం బాధించలేదన్నారు. గాడ్‌ఫాదర్ ప్రమోషన్స్‌లో ఉన్న ఆయన ఈ మాటాలు అన్నారు.
''కెరీర్ ప్రారంభమైన కొత్తలో విజయం వచ్చినప్పుడు బాగా ఆనందించేవాడిని. పరాజయం వస్తే బాధపడేవాడిని. కానీ ఆ రోజులు గడిచిపోయాయి. మొదటి 15 సంవత్సరాల్లోనే ఎన్నో ఎదుర్కొన్నాను. మానసికంగా, శారీరకంగా అన్నింటినీ తట్టుకోవడం తెలుసుకున్నాను. నటుడిగా పరిణతి చెందిన తర్వాత సినిమా పరాజయాలు నన్నెప్పుడూ బాధపెట్టలేదు. విజయాన్ని తలకెక్కించుకోలేదు''
''సినిమా ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. మన పనిలో మనం బెస్ట్ ఇస్తామంతే. 'ఆచార్య' పరాజయం నన్నస్సలు బాధించలేదు. ఎందుకంటే దర్శకుడు చెప్పిందే మేము చేశాం. ఈ సినిమా విషయంలో ఉన్న ఒకే ఒక్క చిన్న విచారం ఏంటంటే.. చరణ్ నేను కలిసి మొదటిసారి సినిమా చేశాం. అది హిట్ కాలేదు. ఒకవేళ భవిష్యత్తులో మేము మళ్లీ కలిసి పనిచేయాలనుకుంటే ఇంతటి జోష్ రాకపోవచ్చు. అంతకు మించి ఎలాంటి బాధ లేదు'' అని చిరంజీవి వివరించారు.
కాగా, చిరు 'గాడ్ ఫాదర్' రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. మలయాళంలో సూపర్‌హిట్ అందుకొన్న 'లూసిఫర్'కు రీమేక్‌గా ఇది సిద్ధమైంది. మోహన్‌రాజా దర్శకుడు. సల్మాన్‌ఖాన్, నయనతార, సత్యదేవ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: మత్తు చూపులతో మతిపోగొడుతున్న మలయాళీ ముద్దుగుమ్మ