తెలుగు ఓటీటి సెలబ్రెటీలు స్పెషల్ టాక్ షోలు ఈ మధ్యకాలంలో ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ బాస్టర్ హిట్ దిశగా కొనసాగుతున్నాయి. దీంతో పలు ఎంట్ర్టైన్మెంట్ సంస్థలు ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేందుకు ఇలాంటి షోలను రూపొందిస్తున్నాయి. అలా తాజాగా మరో ఓటీటీ సెలబ్రిటీ టాక్ షో మొదలైంది. అదే నిజం విత్ స్మిత. తాజాగా ఈ షో ఫస్ట్ ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరై సందడి చేశారు. నటుడిగా తాను ప్రశంసలే కాదు.. విమర్శలను సైతం ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..
అటు వైపే వెళ్లలేదు.. "పరిశ్రమలోకి ప్రవేశించి.. నటుడిగా ఈ స్థాయికి వచ్చే క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. కొన్ని సందర్భాల్లో మానసిక క్షోభకు గురయ్యాను. నా బాధను ఎవరితోనూ పంచుకోలేదు. అన్నింటికీ నన్ను నేను సమాధానపరచుకొని మళ్లీ సాధారణ జీవితంలోకి వచ్చేవాడిని. ఇండస్ట్రీలోకి రావాలనే ఆశతో మద్రాస్‌కు వచ్చిన కొత్తలో ఓసారి పాండిబజార్‌కు వెళ్లాను. అక్కడ ఓ వ్యక్తి నన్ను చూసి.. ఏంటి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లోకి వచ్చావా? సినిమాల్లోకి ప్రయత్నిద్దామనేనా? అతడిని చూడు ఎంత అందంగా ఉన్నాడో.. అతడి కంటే నువ్వు అందగాడివా? తెలిసినవాళ్లు లేకపోతే పరిశ్రమలోకి రావడం కష్టమే..! కాబట్టి నీ కలను మర్చిపో అని హేళనగా మాట్లాడాడు. ఆ మాటలు నన్ను బాధకు గురి చేశాయి. ఇంటికి వెళ్లిపోయి దేవుడి ముందు కూర్చొని.. ఇలాంటి వాటికి బెదరకూడదని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత ఏడాదిపాటు ఆ పాండిబజార్ వైపు వెళ్లలేదు. ఇప్పుడు ఎవరైనా నన్ను విమర్శిస్తే నేను వాటిని పట్టించుకోను. చూసి నవ్వుకుంటాను. గుర్తింపు పొందడం కోసమే ఆ వ్యక్తి అలా మాట్లాడుతున్నాడని అనుకుంటా’"