Chiranjeevi Unstoppable with NBK: బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రసారమైన 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' తొలి సీజన్ ఎంతలా హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్వరలోనే రెండో సీజన్ ప్రారంభంకాబోతున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ఆగస్టు 15న వివరాలు తెలియజేస్తామన్నారు. అయితే ఇప్పుడీ షో గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. తొలి సీజన్లో గెస్ట్‌గా వస్తారనుకున్న మెగాస్టార్ చిరంజీవి.. రెండో సీజన్లో వచ్చేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం సాగుతోంది. మొదటి ఎపిసోడ్‌కే ఆయన్ను తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఆ తర్వాత వెంకీ, నాగార్జున కనిపిస్తారని టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ఆగస్టు 15వరకు వేచి ఉండాల్సిందే. ఇక సినిమాల విషయానికొస్తే.. 'గాడ్‌ఫాదర్', 'వాల్తేరు వీరయ్య'లతో చిరు బిజీ అవ్వగా.. 'ఎన్బీకే 107' చిత్రంలో బాలయ్య నటిస్తున్నారు. ఆ తర్వాత అనిల్రావిపూడితో చేయనున్నారు.
Rana in Sharukh-Atlee film: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్-విలక్షణ నటుడు రానా కలిసి నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి హిందీ, తమిళ చిత్రసీమ వర్గాలు. నాలుగేళ్లుగా సిల్వర్‌స్క్రీన్‌కు దూరంగా ఉన్న షారుక్.. 2023లో ఒకేసారి మూడు చిత్రాలతో రానున్నారు. 'పఠాన్', 'జవాన్', 'డంకీ'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. అయితే వీటిలో 'జవాన్' మూవీని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోనే రానా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిసింది. దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుందట. ఒకవేళ ఇదేకనుక నిజమైతే రానా ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్ట్ చేరినట్టే.