Chiranjeevi Happy Birthday : యాక్షన్, కామెడీ, ఎమోషన్, డ్యాన్స్.. ఇలా నవరసాలన్నింటిలో మాస్టర్‌గా నిలిచి ఎంతోమందిలో స్ఫూర్తినింపిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. పాత్ర ఏదైనా ఛాలెంజ్‌గా స్వీకరించి తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాక్సాఫీసు వసూళ్ల వేటలో మగ మహారాజుగా... సామాజిక సేవతో అందరివాడుగా నిలిచారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భాంగా కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..
Chiranjeevi Dance : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డ్యాన్స్‌కు ఓ ప్రత్యేకత ఉంటుంది. అసలీ ఆ డ్యాన్స్‌కు ఓ క్రేజ్ తీసుకొచ్చిన నటుడు ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవినే. కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు, దానికి కాస్త గ్రేస్ జోడించి స్టెప్‌లు వేయడం ఆయన స్పెషాలిటీ. ఆ ప్రత్యేకతే ఇతర నటుల నుంచి చిరును అభిమానుల్లో ప్రత్యేకంగా నిలిపింది. ఇప్పటివరకూ ఆయన పలు ఐకానిక్ స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. 'నడక కలిసిన నవరాత్రి', 'దాయిదాయి దామా' వీణ స్టెప్ ఇలా చేసిన ఎన్నో స్టెప్పులు సినీ ప్రియుల్లో ఎప్పటికీ గుర్తుండిపోయాయి.
ఆయన వల్లే ఇలా.. అయితే డ్యాన్సుల విషయంలో చిరుకు ఇంత ప్రత్యేకత ఎలా వచ్చిందో తెలుసా? అసలు డ్యాన్స్ విషయంలో చిరు ఎందుకు ఇంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారో తెలుసా? ఆ విషయాల్ని చిరునే ఓ సారి స్వయంగా చెప్పారు. "డ్యాన్సుల విషయంలో వెంకన్నబాబు అనే మేనేజరు నన్ను మార్చారు. అది నా ఐదో సినిమా షూటింగ్ సమయంలో అనుకుంటాను. డ్యాన్స్ చేసి సెట్స్ నుంచి బయటకు వచ్చాను. దీంతో అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టి నన్ను బాగా ప్రశంసించారు. అయినే నేను ఆ పక్కనే ఉన్న వెంకన్నబాబుకి దగ్గరికి వెళ్లాను. 'ఎలా ఉంది? నా పెర్ఫామెన్స్' అని అడిగాను. 'ఆ.. అందులో ఏముంది? నీ వెనక డ్యాన్సర్లు ఏం చేశారో, అదే నువ్వు చేశావ్. నీ ప్రత్యేకత చూపించాలి కదా?' అని చెప్పారు. ఇక అప్పుడే ఆ క్షణమే నిర్ణయించుకున్నాను.. కొరియోగ్రాఫర్లు చెప్పినదానికి అదనంగా ఇంకా ఏదో చేయాలని. అప్పుడు నుంచి అలానే చేస్తున్నాను" అని చిరు అన్నారు.