Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఫొటోలను వీడియోలను షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఇక మెగా అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు నెట్టింట చిరుకు విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా చిరుకు విష్ చేశారు. అయితే ఆయన ఓ క్యూట్ ఫొటో షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అందులో మెగా ప్రిన్సెన్ క్లీంకారను చిరంజీవి ఎత్తుకుని ఉన్నారు. దాంతో పాటు ఓ స్వీట్ క్యాప్షన్ కూడా జోడించారు.
'హ్యాపీయెస్ట్ బర్త్ డే టూ అవర్ డియరెస్ట్ 'చిరు'త(చిరు తాత). మా, అలాగే కొణిదెల ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన కొత్త మెంబర్ నుంచి మీకు బోలెడంత లవ్' అంటూ ఆ ఫొటో కింద క్యాప్షన్ రాసుకొచ్చారు. అయితే ఆ ఫొటోలో పాప ఫేస్‌ను కవర్ చేసి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక రామ్ చరణ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు నెట్టింట ఆయనకు స్పెషల్ విషెస్ తెలిపారు.
Pawan Kalyan Wishesh Chiranjeevi : చిరు సోదరుడు పవన్ కల్యాణ్ అయితే ఆయనకు అడ్వాన్స్ విషెస్ చెప్పి సర్ప్రైజ్ చేశారు. "అన్నయ్య చిరంజీవికి ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తమ్ముడిగా పుట్టి, మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ.. క్రమంగా మహానదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తోంది. మీరు ఎదిగి, మేము కూడా ఎదిగేందుకు ఓ మార్గం చూపడమే కాకుండా.. లక్షలాది మందికి మీరు స్ఫూర్తిగా నిలిచారు. కోట్లాది మంది అభిమానాన్ని మూటగట్టుకున్నా ఏమాత్రం గర్వం కూడా మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. వన్నె తగ్గని మీ అభినయ కౌశలంతో సినీ రంగంలో అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరం. సంపూర్ణ ఆయురారోగ్యాలతో మీరు మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను."అంటూ ఓ ఏమెషనల్ లెటర్ రాసి పోస్ట్ చేశారు.
Chiranjeevi Birthday Wishes : మరోవైపు నట సింహం నందమూరి బాలకృష్ణ కూడా చిరుకు విష్ చేశారు. "మిత్రుడు చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.