మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. ఈ రెండు పేర్లకు ఉండే అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవతరం కథానాయకులు వస్తున్నా వారికి పోటీగా నిలుస్తూ ఇంకా టాలీవుడ్‌ను ఏలుతున్నారు. వీరిద్దరి సినిమా రిలీజ్ అవుతుంటే అభిమానులు చేసే హడావిడి మాములుగా ఉండదు. ఇప్పటికే చాలా చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీపడిన ఈ అగ్రహీరోలు వచ్చే సంక్రాంతికి కూడా పోటీపడనున్నారు. సాధారణంగానే సంక్రాంతి పోరు అంటేనే మస్తు మజా ఉంటుంది. అందులోనూ చిరు, బాలయ్య లాంటి హీరోల మధ్య పోటీ అంటే అది వేరే లెవల్ అనే చెప్పాలి.
అలా ఈ ఇద్దరు వేరువేరుగా నటించిన 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' రెండు సినిమాలు ఒక్క రోజు తేడాలో థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే ఈ సారి వీరిద్దరి సినిమాల గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే.. 2001 సంవత్సరంలో కూడా సంక్రాంతి పండగకు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఒకే రోజున విడుదలయ్యాయి. ఇందులో విశేషమేమిటంటే.. ఈ రెండు చిత్రాల్లోనూ హీరోయిన్ సిమ్రానే. మృగరాజ్ చిత్రంలో హోమ్లీ క్యారెక్టర్ చేసిన సిమ్రాన్.. 'నరసింహనాయుడు'లో గ్లామర్ డాల్‌గా కనిపించి మురిపించింది. అయితే ఇందులో బాలయ్య 'నరసింహానాయుడు' ఇండస్ట్రీ హిట్ కొట్టగా.. చిరు 'మృగరాజు' నిరాశ పరిచింది.