బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ సినిమాల్ని రీమేక్ చేసే ప్రయత్నం చేస్తే తనకు ఎదురుదెబ్బ తగులుతుందన్నారు చిరంజీవి. ఆమిర్ హీరోగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. టాలీవుడ్ హీరో నాగ చైతన్య కీలక పాత్ర పోషించారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలకానున్న నేపథ్యంలో ఆమిర్, నాగ చైతన్య, చిరంజీవిని నాగార్జున ఇంటర్వ్యూ చేశారు. ఆ విశేషాలివీ..
నాగార్జున: ఈ చిత్రాన్ని ఎందుకు సమర్పిస్తున్నారు?
చిరంజీవి: 'లాల్‌సింగ్ చద్దా' కథకు, నా జీవితానికి కనెక్షన్ ఉంది. 2019లో నేనూ నా భార్య సురేఖ జపాన్ వెళ్లాం. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో ఆమిర్ కలిశారు. ఎన్నో విశేషాల గురించి మాట్లాడుకున్నాం. అప్పుడే.. హాలీవుడ్ సినిమా 'ఫారెస్ట్ గంప్' రీమేక్ హక్కులు కొన్నట్టు తెలిపారు. అంత అద్భుత చిత్రానికి ఆమిర్ మాత్రమే న్యాయం చేయగలరని భావించా. అనుకున్నట్టుగానే ఈ సినిమా రీమేకైన 'లాల్‌సింగ్ చద్దా'లో తన మార్క్ నటన చూపించారు. అలా ఈ సినిమాని సమర్పించేందుకు ముందుకొచ్చా.
నాగార్జున: ఈ చిత్రంలో విభిన్న పాత్రలు పోషించారు కదా. దానికి ఎలాంటి కసరత్తులు చేశారు?
ఆమిర్: కొన్ని పాత్రల కోసం వర్కౌట్స్ చేసి బరువు తగ్గా. ఈ సినిమాలోని నా క్యారెక్టర్ శారీరకంగా కాదు మానసికంగా సవాలు విసిరింది. అమాయకంతో కూడిన పాత్ర అది. హావభావాలకే అధిక ప్రాధాన్యం ఉంటుంది.
నాగార్జున: తొలిసారి హిందీ సినిమాలో నటించటం ఎలా అనిపించింది?
నాగ చైతన్య: నాకు హిందీ తెలుసు. కానీ, ఓ నటుడిగా ఆ భాషలో నటించాలంటే ముందుగా కాస్త భయమేసింది. తెలుగు నేటివిటీలో సాగే పాత్ర కావడంతో కంఫర్ట్‌గా ఫీలయ్యా. నేనీ సినిమాలో గుంటూరు కుర్రాడిగా సుమారు 20నిమిషాలు కనిపిస్తా.