Chandramukhi 2 Review : సూపర్ స్టార్రజనీకాంత్ - పి.వాసు కాంబోలో వచ్చిన 'చంద్రముఖి' సినిమా అప్పట్లో తమిళ, తెలుగు భాషల్లో ఘన విజయాన్ని అందుకుని భారీ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టింది. తాజాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా 'చంద్రముఖి 2' ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఈ సారి రజనీ స్థానంలో రాఘవ లారెన్స్.. చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ కనిపించారు. దీంతో ఈ క్రేజీ కలయిక నుంచి వస్తున్న సినిమాపై అందరి దృష్టి పడింది. దీనికి తగ్గట్లుగానే విడుదలైన పాటలు, ట్రైలర్లు సినిమాపై అంచనాల్ని మరింత పెంచాయి. అయితే ఈ సినిమా కథేంటి? ఇది ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచిచ్చింది? అనే విషయాలను తెలుసుకుందాం.
స్టోరీ ఏంటంటే: రంగనాయకి (రాధిక శరత్ కుమార్)ది ఓ పెద్ద కుటుంబం. అయితే ఆ కుటుంబాన్ని అనేక సమస్యలు వేధిస్తుంటాయి. అయితే ఈ కష్టాల నుంచి గట్టెక్కాలంటే వేటయ్యపాలెంలో ఉన్న వారి కుల దైవం దుర్గమ్మ గుడిలో పూజ జరిపించాలని స్వామీజీ (రావు రమేష్) ఆమెకు సలహా ఇస్తారు. దీంతో రంగనాయకి కుటుంబ సమేతంగా వేటయ్యపాలెంకు పయనమవుతుంది. ఇక ఆ కుటుంబానికే చెందిన మరో ఇద్దరు పిల్లల్ని తీసుకొని మదన్ (రాఘవ లారెన్స్) కూడా ఆ ఊరు వస్తాడు. వారంతా కలిసి అక్కడే గుడికి సమీపంలో ఉన్న చంద్రముఖి ప్యాలెస్ (తొలి చంద్రముఖి సినిమా కథ జరిగిన ప్యాలెస్)లోకి అద్దెకు దిగుతారు. అయితే ఆ ఇంట్లోకి అడుగు పెట్టి.. దుర్గ గుడిలో పూజలు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించినప్పటి నుంచి రంగనాయకి కుటుంబంలో ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో 17ఏళ్ల క్రితం బయటకి వెళ్లిపోయిన చంద్రముఖి ఆత్మ తిరిగి వచ్చి రంగనాయకి కుటుంబంలో ఒకరిని ఆవహిస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? మళ్లీ తిరిగొచ్చిన చంద్రముఖి 200ఏళ్ల క్రితం చనిపోయిన వేటయ్య రాజు అలియాస్ సెంగోటయ్య (లారెన్స్) మీద ఎందుకు పగ తీర్చుకోవాలనుకుంది. అసలు వీళ్లిద్దరి కథేంటి? వీరి కథ ఎలా కంచికి చేరిందా లేదా అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
Chandramukhi 2 Review In Telugu : ఎలా సాగిందంటే : ఈ కథకు తొలి చంద్రముఖికి సంబంధం ఉంటుందని.. దీంట్లో ఒరిజినల్ చంద్రముఖి కథను చూపిస్తున్నామని దర్శకుడు పి.వాసు ప్రమోషనల్ ఈవెంట్స్‌లో చెప్పారు. వాస్తవానికి ఈ కథకు తొలి భాగానికి ఎటువంటి సంబంధం ఉండదు. దాన్ని మదిలో పెట్టుకొనే ఓ అంచనాలతో థియేటర్లలోకి వెళ్తే మాత్రం గందరగోళానికి గురికాక తప్పదు. తొలి 'చంద్రముఖి' కథ జరిగిన ఇంట్లోనే ఈ కథ సాగడం.. చంద్రముఖి పాత్ర.. ఈ రెండే దానికి దీనికి మధ్య ఉన్న లింక్. వీటి వెనకున్న అసలు కథలో మాత్రం కొంత మార్పులు కనిపిస్తాయి. కానీ, అవేమీ అంత ఇంట్రెస్టింగ్గా ఉండవు.
ఫస్ట్ పార్ట్‌లో లాగే ఓ ఇంట్రడక్షన్ ఫైట్, పాటలతో సినిమా చాలా రొటీన్‌గానే మొదలవుతుంది. రంగనాయకి కుటుంబం చంద్రముఖి ప్యాలెస్‌లోకి అడుగు పెట్టడం.. అక్కడుండే దక్షిణం గది.. వద్దని వారించినా ఆ గదిలోకి ఆ ఇంటి ఆడపిల్లలు అడుగు పెట్టడం.. ఇక అప్పటి నుంచి రకరకాల కొత్త సమస్యలు మొదలవడం.. ఇలా ప్రతి సీన్ మొదటి 'చంద్రముఖి' సినిమాలోలాగే సాగుతుంది. అయితే మొదటి భాగంలో కనిపించిన థ్రిల్, కామెడీ ఇక్కడ పండలేదు. దర్శకుడు ఒకే తరహా స్క్రీన్‌ప్లేతో ముందుకెళ్లడం.. కథనంలో పెద్దగా సంఘర్షణ లేకపోవడం ఇందులో ఉన్న ప్రధాన లోపం.