ఎన్టీఆర్‌తో అనుబంధం గురించి చెబుతున్న చలపతిరావు సీనియర్ ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమాతో వెండితెరపై చలపతిరావు సినీ ప్రయాణం మొదలైంది. అందులో ఆయన మున్సిపల్ కమిషనర్ వేషం వేశారు. అలా సహాయనటుడు, ప్రతినాయకుడిగా ఎన్నో ఏళ్లపాటు సేవలు అందించిన చలపతిరావు గతంలో ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆ సమయంలో తన సినీ కెరీర్ ఎలా ప్రారంభమైంది? ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధం? వంటి విషయాలను ఆయన పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..
ఎన్టీఆర్‌తో పరిచయం.. సినీ ప్రయాణం ఇలా మొదలైంది..!
"నటనపై ఉన్న ఆసక్తితో చదువుకునే రోజుల్లోనే ఎన్నో నాటకాలు వేసేవాడిని. నటుడి కావాలనే ఉద్దేశంతో మద్రాసు వెళ్లాను. ఏ స్టూడియోకు వెళ్లినా లోపలికి రానిచ్చేవాళ్లు కాదు. దాంతో ఎన్టీఆర్‌గారిని కలవాలని అనుకున్నా. అంత పెద్ద నటుడి దగ్గరకు నన్ను వెళ్లనిస్తారా? అప్పట్లో వజిల్లా రోడ్డులో నాలుగైదు బస్సులు వచ్చి ఆగేవి. అందరూ గుళ్లు కొట్టించుకున్న వాళ్లే. వెళ్లి ఎన్టీఆర్‌ను కలిసి హారతులు ఇచ్చి.. కొబ్బరికాయలు కొట్టి దండలు వేసేవాళ్లు. అప్పుడు ఆయన అందరినీ పలకరించేవారు. తిరుపతి సహా ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చినా రాని ఆనందం ఎన్టీఆర్ పలకరించగానే పులకించిపోయేవాళ్లు. ఇంతకన్నా మంచిదారి లేదని వాళ్లతోపాటు నేనూ వెళ్లా. ఎన్టీఆర్‌ను చూడటానికి వచ్చిన వాళ్లందరినీ పంపించేశారు. నేను ఉండిపోయా. 'నీ సంగతి ఏంటి' అని ఎన్టీఆర్ అడిగారు. 'నేను పీయూసీ వరకూ చదువుకున్నా. సినిమాల్లో వేషం కోసమని చదువు మానేసి వచ్చాను' అని చెప్పా. 'పిచ్చివాడా.. వెళ్లి చదువుకుని ఉద్యోగం చేసుకో. ఇక్కడ వేషాలు రావడం కష్టం' అని అన్నారు. 'లేదన్నయ్యా.. నేను ఫ్యామిలీతో సహా వచ్చేశాను. మళ్లీ వెళ్లడం కుదరదు' అని చెబితే.. 'మొండివాడిలా ఉన్నావే. వారం రోజుల తర్వాత కనపడు' అన్నారు. అలాగే వారం తర్వాత వెళ్లా. 'ఏంటి నువ్వు ఇంకా ఊరికి వెళ్లలేదా?' అని అడిగారు. 'నేను వెళ్లను' అని చెప్పా. అప్పుడే హేమాంభరధరరావు దర్శకత్వంలో 'కథానాయకుడు' తీస్తున్నారు. ఆయన్ను పిలిచి 'వీడు ఎవడో మొండివాడిలా ఉన్నాడు. వీడికో వేషం ఇవ్వండి' అన్నారు.
హేమాంబరధరరావుగారు తన ఆఫీస్‌కు రమ్మన్నారు. మరుసటి రోజు అక్కడి వెళ్తే రెండు రోజుల తర్వాత షూటింగ్‌కు రావాలని చెప్పారు. కొద్దిసేపు నాకు ఏమీ అర్థం కాలేదు. కారు వచ్చి నన్ను తీసుకెళ్లింది. 14మంది ఆర్టిస్టుల కాంబినేషన్ అది. అదే నా తొలి చిత్రం. నేను అప్పటికే స్టేజ్ ఆర్టిస్ట్‌ను కావడంతో నాకు భయం వేయలేదు. తొలిరోజు షూటింగ్ అయిన తర్వాత 'మనవాడు బాగానే చెప్పాడు' అని అన్నారు. ఆయనకు నమస్కారం పెట్టి, బయటకు వచ్చేశా. ఆ చిత్రానికి గోపాలకృష్ణగారు నిర్మాత. 'మనవాడు బాగా చేస్తున్నాడు. నాలుగైదు క్లోజప్ షాట్‌లు తీసి పెట్టు.. పనికొస్తాడు' అని కెమెరామెన్ వీఎస్‌ఆర్ స్వామికి చెప్పారు. ఎందుకంటే నన్ను హీరోగా పెట్టి ఓ సినిమా తీయాలని అనుకున్నారట. ఈలోగా ఆర్థిక ఇబ్బందులు రావడంతో 'కథానాయకుడు' ఆగిపోయింది. మళ్లీ ఆర్నెల్ల తర్వాత సినిమా మొదలు పెట్టి, పూర్తి చేశారు. బాగా ఆడింది. డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత గోపాలకృష్ణగారు సినిమాలు తీయనని చెప్పి వెళ్లిపోయారు. 'చేతి దాకా వచ్చిన అవకాశం పోయింది' అని బాధపడ్డా. ఎప్పటికప్పుడు కష్టం వచ్చేది. దాని వెనకాలో కర్తవ్యం ఉండేది. దాంతో ఏడుపు వచ్చేది కాదు. హీరోగా ప్రయత్నిద్దామంటే అప్పటికే చాలా మంది ఉన్నారు. పోనీలే విలన్‌గా చేద్దామంటే.. సత్యనారాయణ, త్యాగరాజు, ప్రభాకర్‌రెడ్డి ఇలా అనేకమంది ఉన్నారు. ఏం చేయాలో నాకు తెలియలేదు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉండిపోదామని అనుకున్నా. ఇదే విషయం రామారావుగారికి కూడా చెప్పా. అప్పటి నుంచి చిన్నదైనా, పెద్దదైనా ఏ వేషమైనా వేయడానికి సిద్ధపడ్డా".
ఎన్టీఆర్‌తో అనుబంధం..!
"ఎన్టీఆర్‌తో నా ప్రయాణం చాలా బాగుండేది. ఆయనకు చదువుకున్న వాళ్లు ఎవరైనా కనపడితే, 'గురువుగారు' అని పిలిచేవారు. అంత మర్యాదగా మాట్లాడేవారు. సాధారణంగా ఏదైనా సినిమాలో ఒకసారి తండ్రిగా వేషం వేస్తే 'మొన్ననే కదండీ వేశారు.. వద్దు' అని అంటారు. కానీ, 'దాన వీర శూర కర్ణ'లో ఆయన మూడు పాత్రలు చేస్తే.. నేను అయిదు పాత్రలు చేశా. నటుడు, దర్శకుడిలో దమ్ముంటే ఎన్ని పాత్రలు అయినా చేయొచ్చని ఆయన చెప్పేవారు. అంత గొప్ప దర్శకుడాయన. ముందు సూతుడి పాత్ర చేశా. దానికి మూడు గెటప్‌లు. ఆ తర్వాత ఇంద్రుడి పాత్ర కూడా నేనే చేశా. ఒకరోజు సడెన్‌గా ఎన్టీఆర్ కబురు చేశారు. 'ఏంటి అన్నయ్యా.. పిలిచారట' అని అంటే, 'ఆ 14వ ర్యాక్‌లో గడ్డం ఉంటుంది. 12 ర్యాక్‌లో విగ్గు ఉంటుంది. 22వ ర్యాక్‌లో మీసాలు ఉంటాయి. పెట్టుకుని వచ్చేయ్' అన్నారు. నేను ఆశ్చర్యంతో అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయా. 'ఏంటీ.. ఏమైంది?' అన్నారు. 'నేను ఇప్పటికే మూడు వేషాలు.. నాలుగు గెటప్‌లు వేశా. ఇప్పుడు ఇది కూడా వేస్తే జనం నవ్వుతారు' అని అన్నా. ఒక్కసారిగా పెద్దగా నవ్వారు. 'ఒరేయ్ పిచ్చివాడా.. ఇప్పటికీ పల్లెటూళ్లలో ఎన్టీఆర్ ఎవరో తెలియదు.. నిన్ను ఎవడు పట్టించుకుంటాడు.. వెళ్లు' అని అన్నారు. వెళ్లి గెటప్ వేసుకుని వస్తే.. బొట్టు పెడుతూ 'నువ్వు జరాసంధుడివి. వెళ్లి ఆ పాత్ర డైలాగ్‌లు చదువుకో' అన్నారు. ఆయనకు ప్రతి విషయమూ గుర్తే. చెన్నైలో నేను ఇల్లు కట్టుకున్నప్పుడు దాని గృహప్రవేశానికి ముహూర్తం పెట్టింది ఆయనే. గృహ ప్రవేశం నాడు ఉదయం పూట ఇంటికి కూడా వచ్చారు. ఆయనకు ఇష్టమని గోధుమరవ్వ ఉప్మా, మీగడ పెరుగు చేసి పెడితే తిని వెళ్లారు."