తెలుగు పరిశ్రమ మరో మంచి నటుడిని కోల్పోయింది. గుండెపోటుతో సీనియర్ నటుడు చలపతిరావు ఆదివారం కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. చలపతిరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
చలపతిరావు హఠాన్మరణం తీవ్రంగా కలచివేసింది: బాలయ్య
టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు పట్ల హీరో నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. చలపతిరావు హఠాన్మరణం తనను తీవ్రంగా కలచివేసిందని బాలయ్య తెలిపారు. "విలక్షణమైన నటనతో చలపతిరావు తెలుగు ప్రేక్షకులను ఎంతో అలరించారు. నిర్మాతగా కూడా అయన మంచి చిత్రాలు నిర్మించారు. తెలుగు పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయింది. మా కుటుంబంతో చలపతిరావుకు అవినాభావ సంబంధం ఉంది. నాన్నగారితో కలిసి చలపతిరావు అనేక చిత్రాల్లో నటించారు." అంటూ బాలయ్య సంతాపం తెలిపారు.
'సీనియర్ నటులు ఒక్కొక్కరుగా కాలం చేయడం దురదృష్టకరం'
"ప్రముఖ నటుడు చలపతిరావు మృతి చెందడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్రతినాయకుడిగానే కాకుండా సహాయనటుడిగానూ తనదైన శైలిలో ఆయన ప్రేక్షకుల్ని అలరించారు. నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాలు నిర్మించారు. ఆయన కుమారుడు, నటుడు, దర్శకుడు రవిబాబు, ఇతర కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. తెలుగు సినీ పరిశ్రమలో ఒక తరానికి ప్రతినిధులుగా ఉన్న సీనియర్ నటులు ఒక్కొక్కరుగా ఇలా కాలం చేయడం దురదృష్టకరం" అని పవన్ పేర్కొన్నారు.
చలపతిరావు ఆత్మకు శాంతి చేకూరాలి: చిరంజీవి
"విలక్షణమైన నటుడు,తనదైన శైలి తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన చలపతి రావుగారి అకాల మరణ వార్త నన్ను కలచివేసింది. ఎన్నో చిత్రాల్లో ఆయనతో కలిసి నటించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రవిబాబుకి, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి." అంటూ చిరంజీవిలో ట్విట్టర్లో సంతాపం తెలిపారు.
నందమూరి ఫ్యామిలీ ఓ కుటుంబసభ్యుడిని కోల్పోయింది: ఎన్టీఆర్
"చలపతిరావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఒక కుటుంబసభ్యుడిని కోల్పోయింది. మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతిరావు గారి మృతి మా అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్ధన." అంటూ జూనియర్ ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. మరో హీరో కల్యాణ్‌రామ్ కూడా చలపతిరావు మృతి పట్ల సంతాపం తెలిపారు.