Bubblegum Movie Review :సినిమా: బబుల్‌గమ్; నటీ నటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి తదితరులు; మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల; ఛాయాగ్రహణం: సురేష్ రగుతు; స్టోరీ: రవికాంత్ పేరెపు, విష్ణు కొండూరు, సెరి-గన్ని; డైరెక్టర్: రవికాంత్ పేరేపు; నిర్మాణ సంస్థలు: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ; విడుదల తేదీ: 29-12-2023
ప్రముఖ యాంకర్ సుమ- రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల 'బబుల్‌గమ్' సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి మాసన చౌదరి హీరోయిన్గా నటించింది. 'కృష్ణ అండ్ హీజ్ లీలా' ఫేమ్ డైరెక్టర్ రవికాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అరంగేట్ర హీరో నటన ఎలా ఉంది? తొలి సినిమాతో హిట్ అందుకున్నాడా?
కథేంటంటే: ఆది అలియాస్ ఆదిత్య (రోషన్ కనకాల) హైదరాబాద్‌కు చెందిన ఓ మధ్యతరగతి కుర్రాడు. డీజే అవ్వాలన్న లక్ష్యంతో జీవిస్తుంటాడు. ఓ పార్టీలో జాను అలియాస్ జాన్వీ (మానస చౌదరి)ని చూసి మనసు పారేసుకుంటాడు. ఆమె చాలా పెద్దింటి అమ్మాయి. ఆధునిక జీవన శైలికి అలవాటు పడిన ఆమెకు ప్రేమ, పెళ్లి వంటి ఎమోషన్స్‌పై అంతగా నమ్మకం ఉండదు. అబ్బాయిల్ని ఓ టాయ్‌లా చూసే తను మొదట్లో ఆది డీజే ప్లే చేసే తీరు నచ్చి ఇష్టపడుతుంది. ఆ తర్వాత అతని వ్యక్తిత్వం నచ్చి మరింత సన్నిహితంగా మెలుగుతుంది. ఈ క్రమంలో తెలియకుండానే ఆదితో ప్రేమలో పడిపోతుంది. అయితే ఓ పార్టీలో జాను ఫ్రెండ్ చేసిన ఓ తొందర పాటు పని వాళ్లిద్దరి మధ్య చిచ్చు రేపుతుంది. అంతేకాదు ఆ వేడుకలో అందరి ముందు ఆదిని దారుణంగా అవమానిస్తుంది జాను. మరి ఆ తర్వాత ఏమైంది? జాను చేసిన ఆ అవమానాన్ని ఆది ఎలా తీసుకున్నాడు? రెండు భిన్న నేపథ్యాలు కలిగిన వీరి ప్రేమ ఆఖరికి ఏ కంచికి చేరింది?డీజే అవ్వాలన్న తన లక్ష్యాన్ని ఆది చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.
ఎవరెలా చేశారంటే:పక్కా హైదరాబాదీ కుర్రాడిగా ఆది పాత్రలో రోషన్ చక్కగా ఒదిగిపోయాడు. అతని లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అన్నీ బాగున్నాయి. భావోద్వేగభరిత సన్నివేశాల్లోనూ చక్కటి నటన కనబరిచాడు. జాన్వీగా మానస చౌదరి ఇటు అందంతోనూ అటు అభినయంతోనూ ఆకట్టుకుంది. కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో ప్రేక్షకుల్ని హీటెక్కించే ప్రయత్నం చేసింది. హీరో తండ్రిగా చైతూ జొన్నలగడ్డ పాత్ర అందర్నీ ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధానికి ఈ పాత్ర ప్రధాన ఆకర్షణ. బుబుల్‌గమ్ పేరుకు తగ్గట్లుగా ప్రథమార్ధమంతా సాగతీత వ్యవహారంలా ఉంటుంది. ద్వితీయార్ధం మాత్రం కాసిన్ని నవ్వులతో.. ఇంకొంచెం భావోద్వేగాలతో కట్టిపడేస్తుంది. యువతరాన్ని ఆకర్షించాలనే ప్రయత్నంలో కథలో బూతులు ఎక్కువ వాడేశారనిపిస్తుంది. అలాగే దర్శకుడు తను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోయారనిపిస్తుంది. అయితే కొత్త నటీనటుల నుంచి మంచి నటన రాబట్టుకోవడంలో పైచేయి సాధించాడు. శ్రీచరణ్ పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేకున్నా.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సురేష్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.