బాలీవుడ్ పరిస్థితి కొంతకాలంగా మారిపోయిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ లేక విలవిలలాడుతోంది. ఓ వైపు వరుస ఫ్లాప్‌లు, మరోవైపు బాయ్‌కాట్ సెగ.. బీటౌన్‌కు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే భయాలన్నింటికీ రణ్‌బీర్ 'బ్రహ్మాస్త్ర' చెక్ పెట్టేలా కనిపిస్తోంది. హిందీలో ఈ ఏడాది విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్', 'భూల్ బులయ్యా 2', 'గంగూబాయి కతియవాడి' మినహా మిగతా సినిమాలు భారీ విజయాలు సాధించలేదు. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా', అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్', 'బచ్చన్ పాండే', రణ్‌బీర్ కపూర్ 'షంషేరా', విజయ్ దేవరకొండ 'లైగర్' వంటి సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాలన్నింటికీ బాయ్‌కాట్ ట్రెండ్ సెగ తగిలింది. ఇటువంటి సమయంలో 'బ్రహ్మస్త్ర' అడ్వాన్స్ బుకింగ్ బాలీవుడ్‌కు ఊపిరి పోసేలా ఉంది.
అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సెప్టెంబరు 9 శుక్రవారం 63, శనివారం 25, ఆదివారం 12శాతం బుక్ అయ్యాయని ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. విడుదల రోజున టాక్ ఆధారంగా వీకెండ్ బుకింగ్స్ పెరిగే అవకాశముందని చెప్పారు. కాబట్టి ఈ సినిమాపై బాయ్ కాట్ ఎఫెక్ట్ పెద్దగా లేదని చెప్పారాయన. అలాగే ఈ మూవీ చూసేందుకు ప్రేక్షకులు కాస్త ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. తెలంగాణలోని హైదరాబాద్, కర్ణాటకలోని బెంగళూరు వంటి నగరాల్లో కూడా 'బ్రహ్మాస్త్ర' బుకింగ్స్ బాగానే జరిగాయని చెప్పారు.