ప్రస్తుతం ఉత్తరాది హీరోలు తెలుగులో మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన 'పృథ్విరాజ్', 'లాల్ సింగ్ చడ్డా', 'షంషేరా' వంటి సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అంతగా వసూళ్ళు సాధించలేకపోయాయి. ఇక షంషేరాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా రణ్‌బీర్ ఇప్పుడు 'బ్రహ్మాస్త్రం'తో ఎలాగైనా తెలుగులో భారీ విజయం సాధించాలని ఆరాటపడుతున్నారు.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ అడ్వేంచర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ హిందీతో పాటు తెలుగులోనూ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇందులో భాగంగానే రామోజీఫిలిం సిటీలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. దానికి తగ్గట్టే సెట్‌ను కూడా నిర్మించారు. ఇక ఈ వేడుకకు ఎన్టీఆర్‌ను గెస్ట్‌గా పిలిచారు. కానీ చివరి నిమిషంలో పోలీస్‌ల నుంచి పర్మిషన్ రాకపోవడం వల్ల ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారు. ఈ క్రమంలో బ్రహ్మాస్త్రం టీమ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది.